బియ్యం కొట్టేసి డబ్బులు చెల్లిస్తానంటూ పేర్ని నాని రెండు విడతలుగా రూ. కోటి 72 లక్షలు కట్టారు. ఆయన కొట్టేసిన బియ్యానికి అవి సరిపోవడనికి మరో రూ. యాభై లక్షలకుపైగా కట్టాల్సి ఉంటుందని అయినా దొంగతనం కేసు మాత్రం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పుడు రూ. యాభై లక్షలు కూడా కడతారు. ఆయనకు చెందిన మరో గోడౌన్ లో తనిఖీలు చేయాల్సి ఉంది. అక్కడెంత బయటపడతాయో తెలియాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతూండగానే అసలు పేర్నినానికి ఇంతపెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న వస్తోంది.
రూ. రెండు కోట్లు వైట్ మనీ చూపించడం అంటే చిన్న విషయం కాదు. పేర్ని నానికి ఉన్న ఆదాయం, వ్యాపారాల్లో అంత మొత్తం సర్దడం రిస్కే. కానీ ఆయన రెండు చెక్కులతో ఆ మొత్తం కట్టేశారు. ఓ మిత్రుడి దగ్గర థర్డ్ పార్టీ చెక్కులుగా ఆయన చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఆయన పేరు మచిలీపట్నంలో ఉండే వ్యాపారవేత్త ఫణిగా గుర్తించారు. ఆయనకు.. పేర్ని నానికి ఉన్న లావాదేవీలేంటన్నది బయటకు రావాల్సి ఉంది.
చేసిన తప్పును కప్పిపుచ్చుకుని బయటపడటానికి .. పేర్నినాని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మాములుగా తాను జైలుకెళ్లాల్సి వస్తే పొలిటికల్ షో చేసి వెళ్లి ఉండేవారేమో కానీ అక్కడ అసలు నిందితురాలిగా పేర్ని నాని భార్య ఉన్నారు. అప్పటికే ఆయనకు కుటుంబ సమస్యలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఆయన భార్యను జైలుకు పంపించుకుంటే.. అటు రాజకీయంగా.. ఇటు కుటుంబపరంగా ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోతారు. అందుకే డబ్బులు కట్టారు . అయితే కేసు మాత్రం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పేర్ని నాని తనకు తెలియకుండానే నిండా మునిగిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.