కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకూ స్పందించలేదు. అయితే, నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ ఫోన్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మద్దతు కోరారు. ఇదే అంశమై ఇప్పటికే కొంతమంది జాతీయ స్థాయి నేతలు చంద్రబాబుతో ఫోన్ లో చర్చించినట్టు సమాచారం. అయితే, దీనిపై ఎలా స్పందించాలనే అంశంపై టీడీపీలో కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. కర్ణాటక రాజకీయం నేపథ్యంలో మాట్లాడితే మంచిదని కొందరు సీఎంకి సలహా ఇస్తుంటే, మౌనంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు మరికొందరి నుంచీ వ్యక్తమౌతున్నాయట. ఇదే అంశమై కొంతమంది మంత్రులతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది.
ఒకవేళ టీడీపీ స్పందిస్తే ఏం జరుగుతుంది..? మరోసారి భారతీయ జనతా పార్టీ తీరుపై విమర్శలు చేయాల్సి వస్తుంది. గవర్నర్ వ్యవస్థను ఇంకోసారి తప్పుపట్టాల్సి వస్తుంది. గతంలో కూడా తాము ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశామని మరోసారి చెప్పాల్సి ఉంటుంది. అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు భాజపా సిద్ధపడుతుందనీ, అలాంటి అధికారం ఆంధ్రాలో దక్కదనే ఉద్దేశంతోనే ప్రత్యేక హోదా వంటి అంశాల పట్ల చిన్నచూపు చూస్తోందని విమర్శించొచ్చు. సో.. ఈ రకంగా భాజపా తీరుపై మండిపడేందుకు వచ్చిన మరో అవకాశంగా ఈ సందర్భాన్ని టీడీపీ వాడుకునే అవకాశం ఉంటుంది.
అయితే, ఇప్పుడు ఇలా స్పందించడం వల్ల రాజకీయంగా మరో రకమైన సంకేతాలకూ ఆస్కారం ఉంది. ప్రస్తుతం దేవెగౌడ నుంచి వచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందిస్తే… పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు పలికినట్టు అవుతుంది. ఎందుకంటే, ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ లు కూటమిగా ఏర్పడ్డాయి కదా! జేడీఎస్ ప్రయోజనాలను కాపాడటమంటే.. పరోక్షంగా కాంగ్రెస్ కు సాయం చేసినట్టే అవుతుంది. ఆ రకంగా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, మధ్యేమార్గంగా గవర్నర్ తీరుపై విమర్శలు చేసి మమ అనిపించుకుంటారేమో చూడాలి. దేవెగౌడ ఫోన్ చేసింది ఒక్క చంద్రబాబుకి మాత్రమే కాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతోపాటు మరికొంతమందికీ ఫోన్లు చేశారు. భాజపా తీరుపై ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు. ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయో కూడా వేచి చూడాలి.