హీరోలంతా ఇప్పుడు పారితోషికాలు పెంచేసే మూడ్ లో ఉన్నారు. చిరంజీవి కూడా తన పారితోషికాన్ని రూ.75 కోట్లకు పెంచేశారు. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకు ఆయన అక్షరాలా రూ.75 కోట్లు తీసుకొంటున్నట్టు టాక్. దానికి తోడు బ్యానర్ ఇచ్చినందుకు కుమార్తెకు రూ.10 కోట్లు అదనంగా ఇవ్వాలి. అంటే… మొత్తం రూ.85 కోట్లన్నమాట. అనిల్ రావిపూడి పారితోషికం రూ.25 కోట్లు. ఇటీవలే ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ సినిమా రూ.300 కోట్లు సాధించింది. కాబట్టి అడిగినంత ఇవ్వడంలో తప్పు లేదు. వీరిద్దరి పారితోషికాలకే దాదాపుగా రూ.115 కోట్లయ్యాయి. మిగిలిన పారితోషికాలు, మేకింగ్, పబ్లిసిటీ దానిపై వడ్డీలూ ఇవన్నీ కలుపుకొంటే మరో రూ.100 కోట్లవుతాయి. అంటే.. ఈ సినిమా బడ్జెట్ పేపర్ మీదే.. రూ.215 కోట్లు కనిపిస్తోంది.
రూ.215 కోట్లు పెట్టి సినిమా తీస్తే… రిటర్న్ ఎంత రావాలి? బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా ఎంత వసూలు చేయాలి? చిరంజీవి సినిమా కదా, డబ్బులు ఎలాగైనా రాబట్టుకోవొచ్చులే అన్న ధీమా ఇప్పుడు లేదు. సినిమా అటూ ఇటూ అయితే అందులో ఎంత గొప్ప స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోరు. ‘ఆచార్య’, ‘భోళా శంకర్’ ఫలితాలే అందుకు నిదర్శనం. నాన్ థియేట్రికల్ రైట్స్ ఉన్నాయన్న ధీమా లేదు. ఎందుకంటే ‘విశ్వంభర’ ఓటీటీ ఇప్పటికీ తేలలేదు. ఓటీటీ రూపంలో ఈ సినిమాకి రూ.50 కోట్ల వరకూ వస్తాయని చిత్రబృందం ఆశించింది. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం రూ.25 కోట్లకు పైసా ఇవ్వలేం అని చేతులు ఎత్తేశాయి. ఇదీ వాస్తవ పరిస్థితి.
ఎన్టీఆర్ ‘దేవర’ అమ్మిన రేట్లకు చిరంజీవి సినిమా అమ్మినా.. అటూ ఇటుగా రూ.200 కోట్లు వస్తాయి. అది కూడా చాలా హై రేట్లు. అంటే పెట్టుబడి అతికష్టమ్మీద రాబట్టొచ్చు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే… కొన్న డిస్టిబ్యూటర్లు సేఫ్ అవుతారు. అక్కడి వరకే. మరి లాభాలు తెచ్చుకోవాలంటే ఈ సినిమా అద్భుతాలు చేయాలి. ఆ కెపాసిటీ ఉందా?
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడొందల కోట్లు సాధించేసిందా? అని లెక్కలేసుకొంటే పప్పులో కాలేసినట్టే. సంక్రాంతికి వస్తున్నాం రెమ్యునరేషన్లు వేరు, చిరంజీవి సినిమా లెక్కలు వేరు. వెంకటేష్‌కి మహా అయితే రూ.10 కోట్లు ఇచ్చి ఉంటారు. అనిల్ రావిపూడి లెక్క కూడా అంతే. కేవలం 70 రోజుల్లో పూర్తి చేసిన సినిమా ఇది. కాబట్టి… రిటర్న్ ఎక్కువగా కనిపించాయి. అదే ఈ సినిమాకి రూ.200 కోట్లు పెట్టుంటే నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు ఎంత మిగులుతుంది? అయినా ప్రతీ సినిమా `సంక్రాంతికి వస్తున్నాం` కాదు కదా?!
‘విశ్వంభర’ జాతకం కూడా ఈ ప్రాజెక్ట్ ని డిసైడ్ చేయబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘విశ్వంభర’ సూపర్ డూపర్ హిట్టయి, ‘వాల్తేరు వీరయ్య’ని దాటేస్తే అప్పుడు చిరు మార్కెట్ రూ.200 కోట్ల వరకూ ఓపెన్ అవుతుంది. మరి ‘విశ్వంభర’కు అంత స్టామినా ఉందా? సంక్రాంతి సీజన్లో, మంచి పాజిటీవ్ బజ్ తో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ ఫైనల్ రన్ లో రూ.130 కోట్ల షేర్ వసూలు చేసింది. `విశ్వంభర`కు అండగా సంక్రాంతి సీజన్ లేదు. పాటలు ఎలా వచ్చాయో తెలీదు. టీజర్ తేలిపోయింది. మరి వీటన్నింటి మధ్యా `వాల్తేరు రికార్డులు బ్రేక్ చేయగలదా` అనేది అనుమానమే.
చిరంజీవితో చిక్కంతా పారితోషికంతోనే వచ్చింది. ఆయన ఏకంగా రూ.85 కోట్లు కోడ్ చేస్తే నిర్మాతలు చేసేదేముంది? ఒకటి మాత్రం నిజం… చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా గత రికార్డులపై ధీమాతో చేయడం లేదు. కేవలం కాంబోపై ఉన్న క్రేజ్‌తో చేస్తున్నారు. పైగా సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారు. సంక్రాంతికి చిరంజీవి సినిమా సూపర్ హిట్టయితే – ఆ మజానే వేరు. కాకపోతే.. అంకెల పరంగా ఎంత గొప్పగా రీచ్ అవుతుందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ చేయడం సాసహమే!!