ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే కేవలం పోస్టర్లు, ఆడియో క్యాసెట్ లోని పాటలే. వాటిని బట్టే సినిమా మీద అంచనాకి వచ్చేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఫస్ట్ లూక్, మోషన్ పిక్చర్, టీజర్లు,ట్రైలర్లు, ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లు, ప్రి-రిలీజ్ ఫంక్షన్లు. ఇవన్నీ ప్రమోషన్ లో భాగమే. అయితే ఈ ప్రమోషన్ల కారణంగా కొన్ని సార్లు సినిమా మీద హైప్ ఎక్కువై, సినిమా కాస్తో కూస్తో బాగున్నప్పటికీ, హైప్ ని రీచవలేక చతికిలపడుతున్నాయి. అదిగో అప్పుడే ఈ ప్రశ్న వస్తోంది. అసలు ప్రమోషన్ ఉద్దేశ్యమేంటి. సినిమాకి హైప్ క్రియేట్ చేయడమా లేక సినిమా మీద సరైన్ అంచనాలు ప్రేక్షకులకి ఏర్పడేలా చేయడమా అని.
ఉదాహరణకి ఖలేజా సినిమాని తీసుకుందాం. అది సినిమాగా రిలీజైనపుడు ఫ్లాప్. కానీ టివిల్లో టెలికాస్ట్ చేసినపుడు మాత్రం సూపర్ హిట్టయింది. అయితే కారణాలు అన్వేషించినపుడు విశ్లేషకులు చెప్పినది ఒకటే. సినిమా బాగున్నప్పటికీ, అంచనాలు అందుకోవడం లో ఫెయిలయిందని. నిజానికి ఈ సినిమా టైటిల్, ప్రమోషన్ అన్నీ ఇదొక పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేసారు. తీరా అక్కడికెళ్తే, యాక్షన్ కంటే కామెదీ ఎక్కువ ఉన్న సినిమా ఇది. బహుశా అ విషయం కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి ఉంటే అంత పరాజయం వచ్చేది కాదు.
ఇలా ప్రేక్షకులని సరిగ్గా ప్రిపేర్ చేయడం లో మెగాస్టార్ చిరంజీవిది అందె వేసిన చేయి. వరసగా మూడు సంవత్సరాల పాటు తాను తీసిన మాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవడం తో ట్రాక్ మార్చి హిట్లర్ అనే సెంటిమెంట్ సినిమా తీసాడు. ఆ సినిమా వస్తున్న కొత్తలో తరచూ టివి ఛానెల్స్ కి వచ్చి (అప్పుడప్పుడే తెలుగు టివి ఛానెళ్ళు 24 గంటల ఛానెల్స్ గా మారాయి) ప్రేక్షకులని ప్రిపేర్ చేసేవాడు. హిట్లర్ అన్న టైటిల్ చూసి మాస్ సినిమా అనుకోవద్దు , సినిమాలో నేను కేవలం 2 పాటల్లోనే డ్యాన్స్ చేస్తాను, మిగిలినవి సిట్యుయేషనల్ సాంగ్స్ అని. అది కాస్తా కరెక్ట్ గా పని చేయడం తోనే చిరంజీవి 2 వ ఇన్నింగ్స్ అలా మొదలైంది.
ఇటీవల వచ్చిన స్పైడర్ సినిమా కి కూడా ఇది వర్తిస్తుంది. పేరు లో స్పై అన్న పదం ఉండటం తో ఇది గూఢచర్యం కి సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ థ్రిల్లర్ అయి ఉంటుందని ప్రేక్షకులనుకుంటే అక్కడ ఒక సైకోపాత్ సినిమా కథ చెప్పారు. ప్రేక్షకులని సరిగ్గా ప్రిపేర్ చేస్తే యావరేజ్ కంటెంట్ తో కూడా పాసైపోవచ్చని చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. మర్యాద రామన్న, జైలవకుశ అందుకు ఉదాహరణలు.
మొత్తానికి, ప్రమోషన్ విషయం లో మేకర్స్ అర్థం చేసుకోవలసింది ఏంటంటే – ప్రేక్షకులు చికెన్ బిరియాని ఆశించినపుడు వెజ్ బిరియాని పెట్టినా డిజప్పాయింట్ అవుతారు. అదే ప్లేట్ మీల్సో, పులిహోరో చాలు అనుకుని వచ్చినపుడు అదే వెజ్ బిరియాని పెడితే పండగ చేసుకుంటారు. ప్రేక్షకుల అంచనాలు కరెక్ట్ గా సెట్ చేయడానికి ఉండే ప్రాముఖ్యత ఇదన్నమాట.