కన్ను పడితే చాలు అది కొట్టేయాడనికి మాఫియాకు చెందిన కొంత మంది చేసే పనులు సినిమాల్లో చూసి ఓహో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కాకినాడ పోర్టును కొట్టేయడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అండ్ గ్యాంగ్ చేసిన పనులు చూస్తే.. ఎవరైనా నిలువెల్లా వణికిపోతారు. ఓ పెద్ద వ్యాపారస్తుడ్ని పట్టుకుని బెదిరించి రూ. మూడు వేల కోట్లకుపైగా ఉన్న వాటాల విలువను రూ. పదమూడు కోట్లకు రాయించేసుకున్నారు. వాళ్ల అధికారం పోవడంతో ఇప్పుడు ఆ బాధితుడు సీఐడీని ఆశ్రయించాడు. సీఐడీ కేసు నమోదు చేయడంతో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
జగన్ అధికారంలోకి రావడంతో అరబిందో పంజా!
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై కన్నేసింది. అందులో కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు ఒకటి. విజయసాయిరెడ్డి తన ఆడిటింగ్ తెలివితేటలతో.. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ కు చెందిన కె.వి.రావు చెందిన అకౌంట్ లెక్కల్లో తేడాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ఏజెన్సీలను రంగంలోకి దింపారు. కుటుంబసభ్యులందర్నీ కేసులు పెట్టి జైలుు పంపుతామని బెదిరించారు. వారికి వచ్చిన వేధింపులతో ఆ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. చివరికి వాట రాయించుకున్నారు.
వైవీ సుబ్బారెడ్డి కొడుకు లీడ్ చేసిన దందా !
వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో గోదావరి జిల్లాల ఇంచార్జుగా ఉండేవారు. ఆయనకుమారుడు విక్రాంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని నడిపారు. ఎవరెవరితో బెదిరిపులు ఇప్పించాలి..ఎలా వేధించాలో మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం చేయించారు. అన్నీ జగన్ కనుసన్నల్లోనే జరిగేవని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఏ వన్ గా కేసు నమోదు అయింది. జగన్ వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. ఓ మాఫియా చేతుల్లో ప్రభుత్వం పడితే.. వ్యాపారసంస్థల్ని కూడా ఎలా లాక్కుంటారో అనే దానికి ఇది ఓ ఉదారంగా లభిస్తుంది.
సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం !
రూ.3 వేల కోట్ల వాటా రూ. 13 కోట్లుకు కొట్టేసేందుకు చేసిన కుట్రలో ఉన్న సంచలన విషయాలు అన్నీ త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సీఐడీ అరెస్టులు ప్రారంభించిన తర్వాత .. ఈ వ్యవహారంలో సీన్ టు సీన్ ఏం జరిగిందో వివరాలు బయటకు వస్తాయి. ఇది ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన వివాదం అని అప్పటి ప్రభుత్వానికి ఏం సంబధం అని వాదించే అవకాశం లేకుండా స్పష్టమైన ఆధారాలతో కాకినాడ డీప్ వాటర్ పోర్టు గత యజమాని కేవీ రావు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.