హైదరాబాద్: రాష్ట్రపతికాకముందు అబ్దుల్ కలామ్ ఒక సైంటిస్టు అన్న సంగతి తెలిసిందే. మరి రాజకీయాలతో ఏమాత్రం సంబంధమూలేని ఆయన రాష్ట్రపతి అయ్యారనేది ఆసక్తికరంగా ఉంటుంది. దానివెనక రాజకీయ కారణాలు కలామ్కుకూడా అప్పటికి తెలిసి ఉండకపోవచ్చుగానీ పెద్ద మంత్రాంగమే ఉంది.
2002లో రాష్ట్రపతి ఎన్నిక జరగటానికి ముందు అదే సంవత్సరంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో ముస్లిమ్‌ల ఊచకోత జరిగింది. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై లౌకికవాదులేకాక నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికూడా మండిపడ్డారు. మోడిని పదవినుంచి తొలగించాలని వాజ్‌పేయి భావించినప్పటికీ, అద్వానీవర్గం వ్యతిరేకించటంతో అది సాధ్యపడలేదు(అదే అద్వానీని మోడిబృందం ఇప్పుడు పక్కనపెట్టటం విశేషం). గోధ్రా అల్లర్ల మచ్చను పోగొట్టుకోవటానికి, ముస్లిమ్ వ్యతిరేకముద్రను తొలగించుకోవటంకోసం రాష్ట్రపతి ఎన్నిక వాజ్‌పేయికి అక్కరకొచ్చింది. కొంతమంది ముస్లిమ్‌ల పేర్లతో ఆయన జాబితా తయారు చేసుకున్నారు. మిస్సైల్ ప్రోగ్రామ్, 1998 అణుపరీక్షలు, ఎస్ఎల్వీ-3 రాకెట్ ప్రయోగాలతో పేరుగాంచిన కలామ్ పేరును నాడు ఎన్డీఏ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు. అప్పుడు అన్నాయూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న కలామ్‌కు ఈ విషయాలేమీ తెలియదు. 2002 జూన్ 10వ తేదీన ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయంనుంచి ఫోన్ వచ్చింది. ప్రధానమంత్రి మాట్లాడాలనుకుంటున్నారని సిబ్బంది చెప్పారు. ఇంతలో మరో కాల్ వచ్చింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునుంచి. ప్రధానమంత్రి ఫోన్ చేస్తారు, దయచేసి కాదనవద్దని బాబు కలామ్‌ను కోరారు. తర్వాత వాజ్ పేయి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ప్రతిపాదనకు అంగీకరించమని కోరారు. ఆయన ఫోన్ పెట్టిన తర్వాత మిత్రులను, సన్నిహితులను సంప్రదించిన కలామ్ ప్రధాని ప్రతిపాదనకు ఓకే చెప్పారు. కలామ్‌ను ముస్లిమ్‌గా చూడలేమని, ఆయన ముస్లిమ్ సంప్రదాయాలను తు చ తప్పకుండా పాటించే వ్యక్తి కాదని అంటూ వామపక్షాలు వ్యతిరేకించాయి(నిజంగానే కలామ్ ముస్లిమ్ సంప్రదాయాలను పెద్దగా పాటించరు. పైగా భగవద్గీతను ఉటంకిస్తుంటారు, కర్ణాటక సంగీత కళాకారిణి సుబ్బులక్ష్మిని ఇష్టపడతారు). రాజకీయ ప్రయోజనాలకోసమే కలామ్‌ను పోటీకి నిలబెడుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మానవహక్కుల ఉద్యమనేత కృష్ణయ్యర్‌ను పోటీకి నిలబెట్టాయి. అయితే కృష్ణయ్యర్ ఓడిపోయారనుకోండి. అదీ కలామ్ రాష్ట్రపతి ఎన్నికవెనక ఉన్న అసలు సంగతి!