వర్మ నుంచి వచ్చిన ఆఖరి క్లాసిక్… సత్య. ఆ తరవాత వర్మ సూపర్ హిట్ అనే పదానికి దాదాపుగా దూరమైపోయాడు. సత్యలో క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా ఉంటాయి. పాటలేవీ పెద్దగా గుర్తుండవు గానీ, ‘కల్లు మామ’ పాట మాత్రం ఆరోజుల్లో అదరగొట్టింది. అదో మాస్ గీతం. మంచి బీటుతో సాగుతుంది. ఇప్పటికీ మత్తెక్కించే గీతాలు ఒక్కసారి ప్లే చేసుకోవాలంటే సత్యలోని కల్లుమామ గీతాన్ని రివైండ్ చేసుకోవాల్సిందే. ఈ పాట రాసిందెవరో తెలుసా? కోన వెంకట్. ఈ పాట వెనుక ఓ గమ్మత్తైన స్టోరీ ఉంది.
‘సత్య’లోని కథలో సందర్భానుసారం ఓ రౌడీ గ్యాంగు పాడుకునే పాట ఒకటి రావాలి. ఈ పాటని రాయమని సిరివెన్నెల సీతారామశాస్త్రిని సంప్రదించాడు వర్మ. ఆయన రెండు మూడు వెర్షన్లు రాసి ఇచ్చారు కూడా. కానీ.. అవేవీ వర్మ ఊహలకు తగినట్టుగా లేవు. పాటలో రా నెస్ కావాలి. క్రిమినల్స్ ఓ పాట పాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఆ పాట. సీతారామశాస్త్రి తన స్థాయికి పది మెట్లు దిగి కలం పట్టుకున్నా – వర్మ కి నచ్చేలా పాట రాలేదు. సత్య సినిమాకి పనిచేస్తున్న కోన.. తాను సరదాగా రాసుకున్న పాటని వర్మకి వినిపించాడు. అది వర్మకి నచ్చేసింది. దాన్నే రికార్డు చేసేశారు. ఈ విషయం సీతారామశాస్త్రికి తెలీదు. ఈ పాట వినిపించడానికి శాస్త్రి దగ్గరకు వెళ్లాడు కోన. `పాట రికార్డు చేశారు. కానీ మీరు రాసిన పాట కాదు. నేను రాసిన పాట` అంటూ భయంభయంగానే వినిపించాడు. అది సీతారామశాస్త్రికి బాగా నచ్చింది. వెంటనే వర్మకి ఫోన్ చేసి ‘నేనుమరో పది వెర్షన్లు రాసినా, ఇంత కంటే బాగా రాదు’ అని చెప్పాడట. అలా… కోన వెంకట్ పాట రాజముద్రతో బయటకు వచ్చేసింది. ఇప్పటికీ ఆ పాటని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం.