కారణాలు ఎవయితేనేమి మళ్ళీ చాలా కాలం తరువాత ఆంధ్రా, తెలంగాణా రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కనబడుతోంది. అయితే ఆ సయోధ్య ఎంత కాలం నిలుస్తుందనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణాలో తెదేపా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీవ్రంగా విమర్శిస్తూ, ఆయన ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ఆయన అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడుతో స్నేహంగా ఉంటారని ఉండాలని ఆశించడం అత్యసే అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో స్నేహమే కోరుకొంటున్నారు కనుక తెలంగాణాలో తన పార్టీ నేతలని కేసీఆర్ కి విరుద్దంగా పోవద్దని లేదా తమ జోరు తగ్గించుకోమని కోరవలసి ఉంటుంది. ఇంతవరకు తెరాసతో భీకర యుద్ధం చేస్తూ, ఇప్పుడు హటాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెరాస ప్రభుత్వం పట్ల తెలంగాణా తెదేపా నేతలు స్నేహపూర్వకంగా మెలగమని కోరడం కూడా అత్యాశ అవుతుంది. తెరాసతో శత్రుత్వమే తప్ప ఎటువంటి పొత్తులు, స్నేహ సంబంధాలు లేనప్పుడు దానితో తెదేపా నేతలు స్నేహపూర్వకంగా మెలిగితే అప్పుడు వారికీ వైకాపాకి తేడా ఉండదు. అప్పుడు వారు కూడా తెలంగాణాలో తమ ఉనికి కోల్పోక తప్పదు. అటువంటి పరిస్థితులని వారు కోరుకోరు చంద్రబాబు నాయుడు కూడా కోరుకోరు కనుక యధాప్రకారం తెలంగాణాలో తెదేపా నేతలు తెరాసతో తమ యుద్ధం కొనసాగించవలసి ఉంటుంది. అదే జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఇదివరకులాగే వ్యవహరించక తప్పదు. అప్పుడు పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయి. ఈ సమస్యకు కనిపిస్తున్న ఏకైక పరిష్కారం తెలంగాణాలో తెదేపా, తెరాస, బీజేపీలు మూడు కలిసి మిత్రపక్షాలుగా కొనసాగడమే. కానీ అది సాధ్యమేనా? ఆలోచించాలి.