తుక్కుగూడలో జన జాతర పేరుతో శనివారం కాంగ్రెస్ నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తున్నది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ఆ పార్టీ లీకులు ఇస్తుండటంతో బీఆర్ఎస్ హైకమాండ్ కు టెన్షన్ పట్టుకుంది. ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నాడో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేల చేరిక విషయంలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా గోప్యత పాటిస్తోంది.
కాంగ్రెస్ లో ఎవరెవరు చేరుతారనేది పార్టీ వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు. నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుండగా..10మంది వరకు వరకు చేరబోతున్నారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్దమైన ఎమ్మెల్యేలతో ఓ దఫా చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయని…ఆ నేతల భవిష్యత్ కు పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో కొంతమందిని శుక్రవారం రేవంత్ సమక్షంలో పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతుండగా… అనంతరం ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో మరోసారి పార్టీ కండువా కప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేలు, నేతల చేరికల విషయంలో సీనియర్ నేత కే.కేకు రేవంత్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న పరిచయాలతో కొత్త, పాత నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఓ బీఆర్ఎస్ మాజీ మంత్రితో కేకే చర్చలు జరిపారని… పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే బాధ్యత తనదని ఆయనకు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు కేకే తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ లో చేరికలు ఉండనున్నట్లు స్పష్టం అవుతోంది.