సుకుమార్ క్రియేటివిటీ పుష్కలం. ఈ విషయంలో డౌటే లేదు. దేశమంతా ‘పుష్ప 2’ కోసం ఎదురు చూస్తోందంటే.. అదంతా సుకుమార్ తఢాకానే. తన సినిమా విషయంలో సుక్కు చాలా క్లారిటీగా ఉంటాడు. సినిమా అంటే అందరికీ ప్యాషన్ అయితే తనకు పిచ్చి. ఎంత టైమ్ ఇచ్చినా ‘ఇంకొంచెం ఉంటే బాగుంటుంది’ అనుకొనే తత్వం. అందుకే `పుష్ప` ఆలస్యం అవుతూ వచ్చింది. ఆగస్టు 15న రావాల్సిన సినిమా ఇది. కాస్త టైమ్ తీసుకోవాలని డిసెంబరు 5కి వాయిదా పడింది. అయినా సరే, సుకుమార్ కి టైమ్ సరిపోలేదు. నిన్నటి వరకూ షూటింగ్ జరుగుతూనే ఉంది. అయితే ‘పుష్ప 2’కి సుక్కు ఒక్కడే కాదు. మరో ఇద్దరు ముగ్గురు అజ్ఞాత దర్శకులు ఉన్నార్ట.
సుకుమార్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నప్పుడు సెట్లో ఒకరిద్దరు ఈ సినిమాకు సాయం పట్టారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. సినిమా చివర్లో ప్యాచ్ వర్క్ కొంత జరగడం సహజం. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ప్యాచ్ వర్క్ కోసమే ఓ షెడ్యూల్ పెట్టుకొంటారు. అలాంటి ప్యాక్ వర్క్ సమయంలో సుకుమార్ సెట్లో లేడని తెలిసింది. సుకుమార్ స్థానంలో సహాయ దర్శకులు ఈ సినిమాని పూర్తి చేశారని టాక్. సాధారణంగా రెండు మూడు యూనిట్లతో షూట్ చేస్తున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు జరుగుతుంటాయి. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లోనూ శంకర్ కాకుండా ఒకరిద్దరు దర్శకులు సహాయపడ్డారు. ‘పుష్ప’కీ అదే జరిగింది. కాకపోతే.. సుకుమార్ స్టైల్ వేరు. ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ తనదే ఉండాలి అనుకొనే రకం. తన పని విషయంలో మరొకరి సహాయం తీసుకోవడం, తన బాధ్యత మరొకరిపై పెట్టడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే సినిమాని త్వరగా పూర్తి చేయాలి, అనుకొన్న సమయానికి అవుట్ పుట్ ఇవ్వాలన్న తపనలో సుకుమార్ ఎక్కువగా స్టూడియోలోనే ఎక్కువగా గడిపారని, ప్యాచ్ వర్క్ సమయంలో సుకుమార్ సెట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. పుష్పకు సంబంధించి ఇప్పటి వరకూ రెండు ఈవెంట్లు జరిగాయి. ఈ రెండింటికీ సుకుమార్ రాలేదు. దానికి కారణం కూడా అదే. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతీ గంట, ప్రతీ నిమిషం కీలకమే. అందుకే అందులోంచి బయటకు రాలేకపోతున్నాడు సుకుమార్.