ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఒకేసారి రెండు స్క్రిప్టులపై వర్క్ చేస్తున్నాడు. ఒకటి.. ‘బ్రహ్మరాక్షస్’, మరోటి ‘జై హనుమాన్’. ఈ కథలపై తలమునకలై కసరత్తులు చేస్తున్నాడు. ‘బ్రహ్మ రాక్షస్’ కథ ప్రభాస్ కోసం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘హనుమాన్’ సీక్వెల్ గా జై హనుమాన్ వస్తోంది. `జై హనుమాన్`లో ప్రధాన పాత్రకు రిషబ్ శెట్టిని తీసుకొన్నారు. అయితే ఈ సినిమాలో ఇంకా చాలామంది హీరోలు ఉంటారు. రాముడి పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోని సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు.. ఇది సప్త చిరంజీవుల కథ అని టాక్. పురాణాల్లో హనుమంతుడు, అశ్వద్ధామ, బలి, కృపుడు, పరశురాముడు… ఇలా ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వాళ్లందరినీ ఈ సినిమాలో చూపించబోతున్నార్ట. ఒక్కో పాత్రకు ఒక్కో హీరోని తీసుకొంటే – ఇక స్క్రీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుంది.
ప్రశాంత్ వర్మ ఆలోచన కూడా అదే. కాకపోతే… హనుమంతుడు, అశ్వద్ధామ, పరశురాముడు పాత్రల్ని చూపించినట్టు మిగిలిన పాత్రలకు అంత స్కోప్ ఇవ్వలేడేమో. అతిథి పాత్రల వరకూ ఓకే. వాటిని ఫుల్ లెంగ్త్ లోకి మార్చడం కష్టం. కాకపోతే ఇది సింగిల్ హీరో కథ కాదు. కనీసం మరో ఇద్దరు ముగ్గురు హీరోలైనా కనిపిస్తారు. కనిపించాలి కూడా. అప్పుడే ఆయా పాత్రలకు వెయిటేజీ వస్తుంది. ప్రస్తుతం ‘జై హనుమాన్’ స్క్రిప్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబరు నుంచి రిషబ్ శెట్టి డేట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతకంటే ముందే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తారు. ప్రీ విజువల్ వర్క్ పకడ్బందీగా చేయడం వల్ల, షూటింగ్ ఈజీ అవుతుంది. 2026లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆ తరవాత ప్రభాస్ తో ‘బ్రహ్మరాక్షస్’ పట్టాలెక్కుతుంది.