లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా 8- 10 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందోనని ఆయా పార్టీ వర్గాలు చర్చలు ప్రారంభించాయి. ఎవరి వాదనలో నిజమెంత అని రాజకీయ వర్గాలు కూడా పబ్లిక్ పల్స్ ను గుర్తించే పనిలో పడ్డాయి.
తెలంగాణలో కాంగ్రెస్ కు గ్రౌండ్ లో ఆదరణ ఉందనేది ఓపెన్ సీక్రెట్. కానీ దానిని అందిపుచ్చుకోవడంలో హస్తం పార్టీ కొంత వెనకబడింది. రేవంత్ మినహా గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఆయన ఒక్కడే లోక్ సభ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీలో జోష్ తీసుకొస్తున్నారు. మంత్రులు ప్రచారం చేస్తున్నా క్యాడర్ ఆశించిన రీతిలో ప్రచారం చేయకపోవడంతో రేవంత్ చెప్తున్నట్లుగా 14 సీట్లు పక్కానా అనే అనుమానం కలుగుతోంది.
బీజేపీలో మాత్రం సీన్ డిఫరెంట్ గా కనిపిస్తోంది. అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా రాష్ట్రంలో వాలిపోతూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ప్రజలకు నమ్మకం కల్గించే విధంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సలహాలు, సూచనలు చేస్తుండటంతో బీజేపీ ఎన్ని సీట్లను సాధిస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టేశారు. పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అసలు ఒక్క సీటు గెలుస్తుందా అనే స్థితి నుంచి ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించే స్థితికి బీఆర్ఎస్ చేరుకోవడంతో గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.