తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నంజుకు తింటున్నాయి. ఎంత మంది నేతలు వెళ్లిపోతున్నా.. నాయకత్వం అత్యంత నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తూ ఉండటంతో.. పోతే పోనీ అనుకుంటూ ఉండటంతో… ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. సీఎల్పీ విలీనం చేసేసి.. తమ రాజకీయం తాము చేస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక… టీ కాంగ్రెస్ పెద్దలు తంటాలు పడుతున్నారు. ఈ లోపు కొత్తగా.. బీజేపీ వారిపై పడటానికి సిద్ధమయింది.
ఆరుగురిలో నలుగుర్ని బీజేపీలోకి తీసుకెళ్తారట కోమటిరెడ్డి బ్రదర్స్..!
భారతీయ జనతా పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ పై గురి పెట్టింది. వారికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనతోనే స్పష్టమయింది. వారు బీజేపీలో చేరడం ఖాయం. అయితే.. వారు ఒంటరిగా వెళ్లదల్చుకోలేదు. తమతో పాటు… కొంత బలగం ఉందని నిరూపించుకునేందుకు.. ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా.. కనీసం నలుగురు ఎమ్మెల్యేల్ని తమతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌కు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు. ఆయన కాకుండా.. ఇంకా ఐదుగురు ఉన్నారు. వారిలో జగ్గారెడ్డి ఒకరు. ఆయనకు.. బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన మొదటగా బీజేపీ లీడర్. ఆలే నరేంద్రతో కలిసి పని చేశారు. అందుకే.. రాజగోపాల్ రెడ్డి.. ఫోన్ చేసి.. బీజేపీలోకి పోదామని ఆహ్వానించారు. ఫలితం ఏమిటో త్వరలో తెలియనుంది.
ద్వితీయ శ్రేణి నాయకత్వాన్నీ దువ్వే ప్రయత్నం..!
రాజగోపాల్ రెడ్డి.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తమతో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేల్లో.. నలుగుర్ని తీసుకెళ్తే.. తమకు పలుకుబడి ఉంటుందని.. గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ములుగు ఎమ్మెల్యే సీతక్కలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎవరు వస్తారో.. ఎవరు రారో కానీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలతో గోడదూకాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఆయన టిక్కెట్ ఇప్పించి గెలిపించిన.. నకిరేకిల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్లో చేరిపోవడంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లినా… వీరితో పాటు వచ్చే అవకాశం లేదు.
ఇంకా నిద్ర లేవని.. టీ పీసీసీ నాయకత్వం..!
కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలపైనా… బీజేపీ కన్నేసింది. ఇప్పటికే.. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ కార్పొరేటర్‌ను… తమ పార్టీలో చేర్చుకుంది. వివిధ జిల్లాల నుంచి ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకత్వానికి… అనేక రాజకీయ ఆఫర్లు ఇస్తూ… ఆకర్ష్‌ను ప్రయోగిస్తోంది. చాలా మంది ఆకర్షితులవుతున్నారని.. కాంగ్రెస్ వర్గాలకు రూఢీగా తెలుసు. కానీ … ఎప్పట్లాగే.. పీసీసీ నాయకత్వం.. చాలా లైట్ తీసుకుంది. ఎవరికీ నమ్మకం కలిగించే ప్రయత్నం చేయడం లేదు. అందుకే.. అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కాంగ్రెస్ పార్టీని నంజుకుంటున్నాయి.