మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌ల ఆడోరకం ఈడోరకం సినిమా చూశాక వారిద్దరితో గుండమ్మ కథ తీస్తే బావుంటుందన్న భావం వ్యక్తం చేశారు దర్శక రత్న దాసరి. ఆ హక్కులు ఎవరి దగ్గర వున్నాయో తెలిస్తే తీసుకోవచ్చన్నారు. మరోవైపున మోహన్‌బాబు ఆడోరకం ఈడోరకం దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడుగా గుండమ్మ కథ తీస్తానని ప్రకటించారు. సరే ఎటూ గురుశిష్యులే గనక వారిద్దరిలో ఎవరు తీస్తారు అన్నది వారు చూసుకోగలరు.
కాని అంతకన్నా ముఖ్యమైన సమస్య గుండమ్మ కథ ఫార్ములాను ఇంకా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఏవేవో కారణాలతో మారుపేర్లతో మారు వేషాలతో అయినవారి ఇళ్లలో ప్రవేశించడం గందరగోళం సృష్టించడం చాలా ఎక్కువగా చలామణి అవుతున్న ఫార్ములా. నిజానికి దాసరి ముప్పైఏళ్ల కిందట తీసిన బుచ్చిబాబు సినిమాలోనే ఆ ఛాయలు కూడా వున్నాయి. సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్,జూనియర్ ఎన్టీఆర్, ఆ మాటకొస్తే మోహన్ బాబు కూడా ఈ తరహా పాత్రలు ధరించిన వారే. ఇటీవలే బాక్సాపీసు బద్దలు కొట్టిన అత్తారింటికి దారేదీ మూల సూత్రం గుండమ్మ కథేనని ప్రేక్షకులకు తెలుసు. ఆర్థిక వనరులు, అభినయ సామర్థ్యం, హంగు దర్పాలు గల మన సినిమా, కుటుంబాలు, పెద్దలు పాత వరవడిలోనే పాకులాడే బదులు మారుతున్న అభిరుచులకు అభిప్రాయాలకు అనుగుణమైన చిత్రాలు తీస్తే బెటరు కదా.