రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌లో వంద శాతం వాటాలను అమ్మకానికి పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ బీజేపీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు కాబట్టి.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గే అవకాశం కూడా లేదు. నోరెత్తలేని అధికార పక్షం.. ప్రశ్నించినా ప్రజల మద్దతు దొరక్క ఉనికి కాపాడుకోవాలంటే సైలెంట్‌గా ఉండాల్సిన దుస్థితిలో పడిన ప్రతిపక్షం.. ఏపీలో ఉన్నాయి. ఇక ఉద్యమించేవారెవరూ కనిపించడం లేదు. పార్టీలకు అతీతంగా విశాఖ నేతలే రోడ్లెక్కాలి. వారి పోరాటం వారి వారి పార్టీల రాజకీయ ఆరాటాలకు పనికి వస్తుంది కానీ.. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి కాదు. ఇప్పుడు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఎంతకు అమ్ముతుందనేది పెద్ద మిస్టరీగా మారింది.
వైజాగ్ స్టీల్స్ విలువ రూ. వెయ్యి కోట్లుగా అంచనా..!?
కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విలువను రూ. వెయ్యి కోట్ల కంటే కొద్దిగా ఎక్కువగా అంచనా వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థకు ఇప్పటి వరకూ రూ. పన్నెండు వేల కోట్ల వరకూ అప్పులు పేరుకుపోయాయి. ఇవి కాకుండా మరో వెయ్యి కోట్లు వరకూ జమ చేస్తే స్టీల్ ఫ్యాక్టరీని అప్పగించేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ఇదే సంచలనాత్మకం అవుతోంది. భూములే 26వేల ఎకరాలు ఉంటాయని చెబుతూంటారు. వైజాగ్‌కు స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించారు. కొంత మంది విరాళంగా ఇచ్చారు. ఇలా మొత్తంగా 26వేల ఎకరాలు ఉంటాయని అంచనా.
కంపెనీ విలువను ఎలా మదింపు చేస్తారు..!?
1970లో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రధాని ఇందిర పార్లమెంట్లో ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే కురుపాం జమిందారులు 6వేల ఎకరాలు, మరికొందరు పారిశ్రామిక వేత్తలు 2వేల ఎకరాలను విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఇంత భూరి విరాళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది సరిపోదు కాబట్టి.. పెద్ద ఎత్తున భూములను సేకరించారు. ప్రజలు కూడా భూములు ఇచ్చారు. విస్తరణ కోసం ఇప్పటికీ కావాల్సినన్ని భూములు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 26వేల ఎకరాల్లో, ఏటా 7.3మిలియన్ టన్నుల సామర్థ్యం, 16వేలమంది ఉద్యోగులు, 17,500మంది తత్కాలిక ఉద్యోగులు, మొత్తం మీద లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించింది విశాఖ ఉక్కు కర్మాగారం. ఇంతటి కంపెనీ విలువను ఎలా మదింపు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
భారతి సిమెంట్స్ లో 51 శాతం వాటా కూడా చేయదా..!?
విశాఖ స్టీల్స్‌కు ఉన్న ఆస్తులు.. ఇతర సామర్థ్యాన్ని పరిశీలించి చూస్తే… పోస్కో కాదు కదా… ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన కంపెనీలు కూడా వంద శాతం వాటాలు కొనడానికి సాధ్యం కాదు. విలువను పరిమితం చేసి తెగనమ్మడమే తప్ప… ఇంకేం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ భూములు లేకుండా… ఒక్క బ్రాండ్‌ని కంపెనీని అమ్మాలనుకున్నా కనీసం రూ. 60 వేల కోట్లకుపైగానే అవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతి సిమెంట్ అనే చిన్న కర్మాగాన్ని పెట్టి ఉత్పత్తి ప్రారంభించక ముందే.. 51 శాతాన్ని రూ. రెండు వేల కోట్లకు అమ్ముకోగలిగారు. అలాంటిది… అంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీలో వంద శాతం వాటా ఎంత ఉండాలి..!?. ప్రజల్లో ఆవేశం పెరగడానికి కూడా ఇలాంటివి కారణం అవుతున్నాయి.