బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు గురిపెట్టిన తుపాకి అక్కినేని కుటుంబానికి తగలడంతో మంత్రి కొండా సురేఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఆమెలో ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఆమెకు మద్దతు ఉండటంతో బయటపడటం పెద్ద విషయం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక ఆమె విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారు అక్కినేని నాగార్జున. వంద కోట్లు పరువు నష్టం కింద ముక్కు పిండి వసూలు చేస్తా అనే సంకేతాలు ఇచ్చేసారు. ఆ సంకేతాలు కొండా సురేఖ లో మరింత ఆందోళన పెంచాయి.
అక్కడి వరకు బాగానే ఉంది గానీ… పరువు కేవలం అక్కినేని కుటుంబానికి మాత్రమే కాకుండా… ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, సూపర్ స్టార్ రజనీ కాంత్ కు, నందమూరి బాలకృష్ణకు, నారా భువనేశ్వరికి, నందమూరి వసుంధరకు ఇలా చాలా మందికి ఉంటుంది. వీళ్ళల్లో పవన్, బాలకృష్ణ మినహా మిగిలిన వాళ్లకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడటం చాలా తక్కువ. కాని వారు అందరి మీద వ్యక్తిగత దాడి జరిగింది. పవన్ విషయంలో విడాకులు, పెళ్ళాలు, కార్లు అంటూ వైసీపీ అధినేత నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ విరుచుకుపడ్డారు.
ఇక రజనీ కాంత్ లాంటి హీరోని చీకేసిన తాటికాయి, ఒక రోజు షూటింగ్ చేస్తే వారం రోజులు పడుకుంటాడు అనే మాటలు కూడా మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఆ తర్వాత కూడా మీడియా ముందు ఒక ఎమ్మెల్యే గారు పదే పదే అవే మాటలు మాట్లాడారు. జగన్ తో సహా వైసీపీ నేతల్లో చాలా మంది మాట్లాడారు. మరి వాళ్ళ విషయంలో పరువు నష్టం వేస్తే… ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడించిన జగన్ పై పరువు నష్టం వేస్తే వేల కోట్లు కట్టాల్సి ఉంటుంది పరువు నష్టం.
అక్కినేని కుటుంబాన్ని కచ్చితంగా వెనుక ఉండి కొందరు ప్రోత్సహించే ప్రయత్నం చేసారు. ఇక సినిమా వాళ్ళు కూడా అప్పుడు లేని మానవత్వాన్ని ఇప్పుడు ప్రదర్శించారు. దీనితో నాగార్జున వంద కోట్లు ఇస్తే నా పరువు నిలబడుతుంది అనుకున్నారో ఏమో కొండా సురేఖపై పరువు నష్టం దావాకు సిద్దమయ్యారు అంటూ సెటైర్ లు వస్తున్నాయి. ఒకవేళ కొండా సురేఖ విషయంలో నాగార్జున గెలిస్తే… వంద కోట్లు కట్టమని తీర్పు వస్తే… వైసీపీ నేతలు కూడా తాము పరువు తీసిన వ్యక్తులకు వేల కోట్లు కట్టాలి మరి.