‘నిర్భయ’ ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిందా? లేదు. ‘కఠువా’ చిన్నారిపై అఘాయిత్యం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిందా? లేదు. ఇండియాలో ప్రతి రోజూ మహిళలపై, అభం శుభం తెలియని పసిపాపలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే… తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన విషయాలను మీడియా ఛానళ్ళు భూతద్దంలో చూపిస్తున్నాయని ఇటీవల తెలుగు సినిమా ప్రముఖుల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీరెడ్డి వ్యవహారంలో మీడియా వ్యవహరించిన తీరు వల్ల తెలుగు సినిమా పరిశ్రమ పరువుకు కాస్త భంగం వాటిల్లిందనేది మాత్రం అక్షర సత్యం. ఈ పరిణామాల పట్ల హీరోలు, తెలుగు సినిమా పెద్దలూ సమావేశం అయ్యారు. అందులో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో తెలియదు. కాని ఇండస్ట్రీలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నట్టున్నారు. ఇటీవల జరుగుతోన్న సినిమా వేడుకల్లో హీరోల మాటలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. నిన్న రాత్రి ‘మహానటి’ ఆడియో విడుదలైంది. అందులో నాగార్జున, ఎన్టీఆర్… ఇద్దరూ మహిళల గౌరవం గురించి మాట్లాడారు.
ముందుగా నాగార్జున మాటల్లో మహిళల ప్రస్తావన చూస్తే… “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల లైఫ్ ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్స్‌లో ‘మహానటి’ ఒకటి. అదీ ఓ తెలుగు సూపర్‌స్టార్, ఓ మహిళ మీద తెరకెక్కించిన బయోపిక్. ఈ సినిమాను నిర్మించిన స్వప్నదత్, ప్రియాంక దత్… ఇద్దరూ మహిళలే. అలాగే, ఈ సినిమాకి ఇరవైమంది ఫిమేల్ టెక్నీషియన్స్ వర్క్ చేశారట. ఆడియోకి ఇంత అద్భుతమైన స్టేజ్ క్రియేట్ చేసింది మహిళలే. ఈ సినిమా సెట్స్ వేసింది మహిళలే. తెలుగు సినిమా ఇండస్ట్రీ మహిళలకు ఇచ్చిన గౌరవం అది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నా” అన్నారు.
ఇండస్ట్రీలో అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే అబ్బాయిలకు లొంగక తప్పదని, గౌరవం దక్కదని మీడియా ఛానళ్లలో అదే పనిగా కొన్ని రోజులు చర్చలు జరిగిన నేపథ్యంలో నాగార్జున వ్యాఖ్యలు తప్పకుండా ప్రజల్లో ఆలోచన కలిగిస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, ఎన్టీఆర్ మాటల్లో సమాజంలో జరుగుతోన్న అత్యాచారాల ప్రస్తావన వచ్చింది.
“ఈ మధ్య మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయనే వార్తలను మనం చూస్తున్నాం. ఒక్కసారి ‘మహానటి’ చూశాక, (అకృత్యాలకు పాల్పడేవారు) ‘మనం ఎందుకు మగాళ్లగా పుట్టాం?’ అని తప్పకుండా అనుకుంటారు. సావిత్రిగారు ట్రూ లేడీ సూపర్‌స్టార్. మహిళ బలం ఏంటో? మహిళలు తలచుకుంటే ఏం చేయగలుగుతారు? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా చూసి మహిళలను గౌరవిస్తారని ఆశిస్తున్నా” అని ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ మాటలు వింటే.. సమాజంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న విషయాలు వాస్తవమే కదా అనిపించక మానదు. అదే సమయంలో సావిత్రి అనే మహిళకు సినిమా పరిశ్రమ ఎంతటి స్టార్ డమ్ కట్టబెట్టింది? ఎంత గౌరవించింది? అనేది గుర్తు చేశారు. మొత్తం మీద హీరోల మాటలను నిశితంగా గమనిస్తే… ఇండస్ట్రీలో మంచిని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ప్రాజెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయినట్టుంది. ఎందుకంటే… ఇండస్ట్రీలో చెడు ఇటీవల అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్ అయ్యింది మరి.