కథను వినగానే జడ్జ్ చేయడం అంత సులువుకాదు. అందులోనూ అంతగా హైప్ లేని డైరక్టర్ అంటే మరీనూ. అందుకే గీతగోవిందం సినిమా కథను చాలా మంది హీరోలు విన్నారు..కానీ ఎవ్వరూ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు. ఆఖరికి విజయ్ దేవరకొండను ఒప్పించారు. ఇదంతా మూడేళ్ల కిందటి ముచ్చట.
గీతగోవిందం కథను డైరక్టర్ పరుశురామ్ వెళ్లి బన్నీ వాస్ కు చెబితే, ఆ కథ కోసం హీరోను వెదికి వెదికి దొరక్క, ఎవ్వరూ ఓకె అనక, దాన్ని పక్కన పెట్టి శ్రీరస్తు శుభమస్తు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. ఆఖరికి బన్నీ ఓ మాట సాయం చేయడంతో విజయ్ కాస్త అయిష్టంగానే ఓకె అన్నాడు.
సినిమాను ఒకటికి రెండు సార్లు చెక్కారు. హీరోయిన్ ను మార్చాల్సి వచ్చింది. హీరో ఇమేజ్ మారడం, పెరగడంతో మరి కొన్ని సీన్లు మార్చారు. ఆఖరికి ఫైనల్ ప్రొడెక్ట్ వచ్చింది. అప్పుడు కూడా హీరో ముందుగా టాక్సీవాలా వదులుదాం, ఇది కాదు అన్నాడు. కాస్త కిందా మీదా పడి ఒప్పించారు. అందుకోసం హీరో విజయ్ తండ్రి సినిమా చూసారు. అప్పుడు ఆయన ఓకె అన్నాక, గీత గోవిందం విడుదలకు మార్గం సుగమం అయింది.
అంతా అయిన తరువాత తన కథను కొట్టేసారని ఓ అసిస్టెంట్ డైరక్టర్ ఫిర్యాదు. దాంతో రాజీ చర్చలు. మరి కాస్త ఖర్చు. అలా ఆ సమస్య సుఖాంతం అయింది. ఇంతలో లీకుల గోల. దాంతో టెన్షన్. సరే, ఆ అడ్డంకులు దాటారు. ఆఖరికి సినిమా విడుదలయింది. 14 కోట్ల సినిమాకు అయిదు కోట్లే రికవరీ. మిగిలినదంతా ఓన్ రిలీజ్. అయినా రెడీ అనుకున్నారు.
ఇప్పుడు పెద్దహిట్ అయింది. అంతా హ్యాపీ. ఇది డైరక్టర్ పరుశురామ్ మూడేళ్ల కష్టం. నిర్మాత బన్నీ వాస్ ఓపిక. చివరకు అంతా సుఖాంతం. సినిమా మాదిరిగానే.