జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని శ్రీరెడ్డి విమర్శిస్తే, దాన్ని ప్రసారం చేశారంటూ మీడియాపై పవన్ వార్ ప్రకటించారు. దాన్ని కాస్తా సినీ పరిశ్రమ సమస్యగా మార్చే ప్రయత్నం జరిగింది! పరిశ్రమలో సమస్యలు ఎత్తిజూపే వేదికగా కాసేపు కనిపించింది. ఆ తరువాత మీడియాలో ఒక వర్గాన్ని పవన్ తప్పుబట్టారు. తన మీద టీడీపీ చేయిస్తున్న కుట్రగా కూడా ఆరోపించారు. ఆజన్మశత్రుత్వం ఉన్నట్టుగా కొన్ని ఛానెల్స్ పై పవన్ కత్తిగట్టేశారు. పనులన్నీ మానుకుని ట్వీట్ల ఫీట్లు చేస్తున్నారు.
ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని పరిణామాలు అన్నట్టుగా మొత్తం వ్యవహారం ఇష్టమొచ్చిన మలుపులు తీసుకుంటోంది. ఈ మలుపుల ప్రయాణం గమ్యమేంటనేది ఇప్పుడిప్పుడే స్పష్టమౌతోంది..! ఈ గమనం వెనక ఉన్న కుట్ర ఏంటో కూడా తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్టు ఇది సినీ పరిశ్రమ సమస్యో, మీడియా సమస్యో, మహిళల సమస్యో కాదు.. ఎక్కడో డొంక కదలడం కోసం లాగబడ్డ తీగలో కదిలకలే ఇవన్నీ!
ఏపీ రాజకీయాల్లో అత్యంత చర్చనీయమౌతున్న తాజా వ్యవహారమంతా భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో సాగుతున్న వ్యవహారంగా విశ్వసనీయంగా తెలుస్తోంది! ఆంధ్రాలో ఒక కులాన్ని వేరు చేయాలన్న లక్ష్యంతో తెర వెనక సాగుతున్న నాటకమే ఇదంతా అనే అభిప్రాయం అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. అందుకే, ప్రస్తుతం పవన్ రాజేస్తున్న వివాదంపై ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా సంతోషంగా ఉందనీ విశ్వసనీయ సమాచారం! ఎందుకంటే, ఇది వారు చేయాలనుకున్న పని! ఏపీలో ఒక సామాజిక వర్గాన్ని వేరు చేయాలని వారూ కోరుకుంటున్నదే కదా! ఒక వర్గం అలా పక్కకు వెళ్తే.. రాజకీయంగా తమకు అనుకూలించే వాతావరణం ఏర్పడుతుందని వైకాపా ఆశ. వైకాపా చేయాలనుకున్న పనిని ఇప్పుడు పవన్ చేస్తున్నారు కదా! అందుకే, ఆ పార్టీకి ఈ రచ్చంతా హాయిగానే అనిపిస్తోందని తెలుస్తోంది.
మీడియాపై పవన్ కల్యాణ్ పోరాట తీరు గమనిస్తే… ఈ వ్యూహం మరింత స్పష్టంగా అర్థమౌతుంది. ఆయన ప్రముఖంగా ఓ మూడు టీవీ ఛానెల్స్ ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో మహా టీవీ మూర్తిని నెమ్మదిగా వదిలేశారు. ఎందుకంటే మిగతా ఛానెళ్లతో పోల్చితే శ్రీరెడ్డి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా చేసి, కొన్ని వందల గంటల డిబేట్లు పెట్టి రచ్చ మొదలుపెట్టిన ఘనత వారిదే కదా! సో… పవన్ పోరాటం వెనక అసలు లక్ష్యం ఇదే అనేది కాస్త ప్రముఖంగా వినిపిస్తున్న అభిప్రాయం.