ఏపీలో కొత్త పెట్టుబడుల సంగతి దేవుడెరుగు…ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేలా జగన్ సర్కార్ పాలన కొనసాగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు వారి అమర్ రాజా బ్యాటరీస్ వంటి పరిశ్రమలు కూడా ఏపీ నుంచి తరలిపోయి…తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. కియా వంటి కంపెనీని చంద్రబాబు ఏపీలో ఏర్పాటు చేసినా.. జగన్ విధానాల ఫలితంగా కొన్నాళ్ళకు తాము రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని బహిరంగ ప్రకటన చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రమే.ఎన్నికల వేళ రాష్ట్రంలో అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలన కోసం ఓ టీంను పంపాలని ఏపీ సర్కార్ కోరినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిని నమ్మతరమా..? అని సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లాలో కియా సంస్థను చంద్రబాబు ఏర్పాటు చేయగా…2019ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ వ్యతిరేకించారు.స్థానికులకు నష్టం చేసే కియా పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని..అధికారంలోకి వచ్చాక దానిని రివర్స్ పంపుతామని హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
తెలుగు వారి కంపెనీలను ఏపీ వదిలి వెళ్ళేలా చేసిన జగన్… నేడు అంతర్జాతీయ కంపెనీని ఏపీకి ఆహ్వానిస్తున్నారంటే ఎలా నమ్ముతామంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ వంటి తెలుగు వారి కంపెనీలకు భద్రత కల్పించకుండా చేశారు. ఈ క్రమంలోనే రేపు టెస్లానైనా కొనసాగనిస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.