రూ. 31 వేల కోట్ల రుణమాఫీని కార్పొరేట్ సంస్థలు కూడా చేయలేదని రేవంత్ గొప్పగా చెప్పుకున్నారు. తాము మాత్రం చేసి చూపించామన్నారు. నిజానికి ఆయన చెప్పినట్లుగా ఇంకా రూ. 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి కాలేదు. ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేస్తామంటున్నారు. గురువారం రైతుల ఖాతాల్లో జమ చేసింది ఆరు వేల కోట్లే. ఇంకా పాతిక వేల కోట్లు కావాలి. ఈ మొత్తం ఎక్కడి తెస్తారన్నది ఇప్పుడు ఆర్థిక నిపుణులకు కూడా అర్థం కావడం లేదు.
నిధుల సమీకరణ ప్రయత్నాలను తెలంగాణ సర్కార్ గుంభనంగా చేస్తోంది. గురువారం రైతుల ఖాతాల్లో వేసిన ఆరు వేల కోట్ల రూపాయలు పూర్తి గా ప్రభుత్వ ఆదాయం. ఎన్నికల కోడ్ కారణంగా ఖర్చులు తగ్గిపోవడంతో ప్రభుత్వం వద్ద కొంత నిధులు జమ అయ్యాయి. వాటితో లక్ష రూపాయల్లోపు రుణమాఫీ పూర్తి చేశారు. నెలాఖరుకు లక్షన్నర, ఆ తర్వాత రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేస్తారు. మరో నెల రోజుల్లోనే రూ. 25 వేల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది.
ఆర్బీఐ వద్ద ప్రతి మంగళవారం తీసుకునే అప్పుల అవకాశాలను గరిష్టంగా వాడుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. అలాగే నాలుగు వందల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి పదిహేను వేల కోట్ల వరకూ సమీకరించాలనుకుంటున్నారు. కొత్తగా మంత్రి శ్రీధర్ బాబు సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. ఆయన ఎక్విప్ దేశీ అనే పెట్టుబడుల సేకరణ సంస్థ తో పాటు ఎన్ఎస్ఈ ప్రతినిధులతో గురువారం సావేశం నిర్వహించారు.
విభిన్న మార్గాలను అంచనా వేసుకుని ఖచ్చితంగా నిధులు సమకూరుతాయనే లెక్కలతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్తున్నారు. ఈ కొత్త విధానాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు కొత్త దారి చూపిస్తాయని అనుకోవచ్చు.