హెటెరో కార్పొరేట్ ఆఫీసులో నోట్ల కట్టలు గుట్టలు, గుట్టలుగా బయపడ్డాయి. ఇప్పటి వరకూ ఆ సొమ్మును రూ. రెండువందల కోట్లుగా చెబుతున్నారు. కానీ అంతకు మించి ఉంటుందన్న ప్రచారమూ ఉంది. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు సోదాలు జరిగిన తర్వాత ఈ అంశంపై ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అప్పుడే ఎంత దొరికిందనేది క్లారిటీ వస్తుంది. అయితే ఈ నోట్ల కట్టలు ఎక్కడివి అనేది మాత్రం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. ఎలా వచ్చాయనేది ఐటీ అధికారులు తేల్చాల్సి ఉంది.
కరోనా కాలంలో బ్లాక్‌లో అమ్మిన స్టెరాయిడ్ డబ్బులా లేకపోతే మరో విధంగా ఏమైనా తీసుకొచ్చారా అన్నదానిపై లెక్కలు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కార్పొరేట్ ఆఫీసులో డబ్బులు కట్టలు దాచుకోవడానిక కార్పొరేట్ కంపెనీలు ఇష్టపడవు. ఎందుకంటే రైడ్ జరిగి దొరికిపోతే అది కంపెనీ ఇమేజ్‌కే తీవ్ర నష్టం . కానీ తమపై దాడులు జరగవన్న ధీమానో.. లేకపోతే అక్కడ దాచి పెడితే ఎవరూ కనిపెట్టలేరన్న అతి తెలివో కానీ హెటెరో కంపెనీలో మాత్రం పెద్ద ఎత్తున నోట్ల కట్టలను పెట్టారు.
ఇలా బహిరంగంగా దొరికిన కట్టలు మాత్రమే కాకుండా పన్నుల ఎగవేత దగ్గర్నుంచి ..మనీ లాండరింగ్ వరకూ అనేక అంశాలపై కొత్త కొత్త విషయాలు బయట పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఎంత మేర ఇవి బయటపడతాయి.. ఐటీ శాఖఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై సోదాలు ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.