దుబాయ్‌లో భారతీయులు చాలా ఈజీగా ఇళ్లు కొనేస్తున్నారు. వెళ్లడానికి వీసా తీసుకోవాల్సిన దేశంలో ఇల్లు కొంటే ఎలా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ దుబాయ్ లో ఎవరైనా ఇల్లు కొనుక్కునేలా అక్కడి ప్రభుత్వం చట్టాలు చేసింది. అంతే కాదు వారి పెట్టుబడులకు భరోసా కూడా ఇస్తోంది. దుబాయ్‌లో కోటి రూపాయలకన్నా ఎక్కువ ధర కలిగిన ఇంటిని కొనుగోలు చేస్తే ప్రభుత్వం నివాస వీసాను ఇస్తుంది. ఇప్పుడు మన దేశంలో రూ. కోటి పెట్టి ఇల్లు కొనుగోలు చేసేవాళ్లు లెక్కకు మిక్కిలిగా పెరిగారు. అలాంటి వారిలో కొంత మంది సంపన్నులు దుబాయ్ లో ఇళ్లు కొంటున్నారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలీ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల ధర కోటి రూపాయలకు పైనే ఉంటుంది. బెంగళూరు, ముంబైవంటి నగరాల్లో రేట్లు హైదరాబాద్ కంటే ఇంకా చాలా ఎక్కువ. దుబాయ్‌లో ఒక మోస్తరు అపార్ట్మెంట్ 60 లక్షల రూపాయలకు కూడా లభిస్తుంది. లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాల ధరలు కోట్లలో ఉంటాయి. అది వేరే విషయం. విదేశీ ప్రయాణాలపై ఆసక్తి ఉన్న చాలా మంది సెలబ్రిటీలు, వ్యాపారస్తులు దుబాయ్‌లో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో మోసానలకు తావులేదు. టాప్ 10 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఆరు ప్రభుత్వానివే.
లగ్జరీ లైఫ్ కోసం దుబాయ్ వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ఈ లిస్టులో.. వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉన్నారు. విలాసవంతమైన జీవనం కోసం, తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు.. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. చాలా మంది భారతీయ కుబేరులు సైతం.. ఇండియాలోని మెట్రో నగరాల నుంచి దుబాయ్‌కి షిఫ్ట్ అయిపోతున్నారు. లగ్జరీ లైఫ్ కోసం.. కోట్లు పెట్టి ఇండ్లు, అపార్ట్మెంట్లు కొనేస్తున్నారు. దుబాయ్‌లో ఇళ్లు కొన్న విదేశీయుల్లో.. భారతీయుల వాటా 40 శాతంగా ఉంది. ఇది చాలు.. ఇండియన్స్ దుబాయ్‌లో ఏ రేంజ్లో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారో చెప్పడానికి. అక్కడి ప్రభుత్వం కూడా భారతీయులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.
హైదరాబాద్‌లో కూడా దుబాయ్ సంస్థలు రియల్ ఎస్టేట్ రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి. కాస్త స్థితిమంతులైన వారు.. దుబాయ్ లో ఇల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అది ఎడారి దేశం కావొచ్చు కానీ.. లగ్జరీకి కేంద్రంగా మారింది.