అమీన్ పూర్ శివారులోని పటేల్ గూడులో ఇటీవల హైడ్రా ఇళ్లు కూల్చేసింది. అన్ని పత్రాలున్నాయని అక్కడ కొనుగోలు చేసిన వారు గగ్గోలు పెట్టారు. నిజానికి వారికి అన్ని పత్రాలున్నాయి. కానీ ఆ స్థలానివి కాదు. కిష్టారెడ్డిపేట లోని ఆరో నెంబర్ సర్వేలో స్థలాలకు రిజిస్ట్రేషన్ చేస్తే.. పన్నెండో నెంబర్ సర్వేలోని చెరువు స్థలంలో ఇళ్లు కట్టారు. ఆ కొన్న వాళ్లకు ఆ సర్వే నెంబర్లపై స్పష్టత లేదు. అసలు ఈ సర్వే నెంబర్లను ఎలా తెలుసుకోవాలి ?
హైదరాబాద్ లో తక్కువ ధరకే ఇళ్లు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయడం చాలా రిస్క్. చెరువులు, నాలాల సమీపంలో అసలు ప్రాపర్టీలను కొనాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు అన్ని పర్మిషన్లు చెక్ చేసుకోవాలి. సంబంధిత విభాగం అధికారులను కలిసి మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లేదా ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు అనుమతులు ఇస్తాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు… ఆ అనుమతులు నిజమైనవా? కావా? అని నేరుగా కార్యాలయాలకు వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవాలి.
అంతే కాకుండా ఆ భూములు ఏఏ సర్వే నంబర్లలో వస్తాయి? అక్కడ చెరువులు, నాలాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా గవర్నమెంట్ రికార్డుల్లో ఉంటుంది. తమకు అమ్మజూపుతున్న ఇల్లు, భూమి ఏ సర్వే నెంబర్ లో ఉన్నాయన్నది కూడా గవర్నమెంట్ రికార్డుల్లో ఉంటాయి. వాటిని అక్కడే చెక్ చేసుకోవాలి. సర్వే నెంబర్ల పరిశీలన బ్రహ్మపదార్థమేమీ కాదు. రెవిన్యూ రికార్డుల్లో అన్నీ ఉంటాయి. మరీ ఆరో నెంబర్ కు.. పన్నెండో నెంబర్కు తేడా తెలియనంతగా ఏమీ ఉండదు.
చెరువులు, నాలాల ఎఫ్టీఎల్ పరిధి, బఫర్జోన్లలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన వారిని ఎక్కువగా ఈ సర్వే నెంబర్లతోనే బురిడీ కొట్టిస్తారు. అందుకే.. సర్వే నెంబర్ల విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని.. పూర్తి స్థాయిలో న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి.