ఇండియా రియల్ ఎస్టేట్ రంగం అంతా ఆర్బీఐ మానిటరీ పాలసీ వైపు ఎంతో ఉత్కంఠగా చూస్తోంది. అయితే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆర్బీఐ గవర్నర్ మాత్రం ఒకటే మాట చెబుతున్నారు. వడ్డీ రేట్లలో మార్పులేదని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉందని అయితే ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లను తగ్గించడం మాత్రం అంత మంచిది కాదని ఆయన అంటున్నారు. ఈ జాగ్రత్తల కారణంగా వడ్డీ రేట్లు తగ్గడం లేదు.
శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెపోరేటును 6.5 దగ్గరే ఉంచున్నామని తగ్గించే ఆలోచన చేయడం లేదని ప్రకటించారు. కనీసం ౦.25 బేసిక్ పాయింట్లు తగ్గినా మార్కెట్లో సెంటిమెంట్ పెరిగేది. వడ్డీ రేట్లు కాస్త తగ్గేవి. అదే ఊపుతో ఊగిసలాడుతున్న ఇళ్ల కొనుగోలుదారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసేవారు. కానీ ఆర్బీఐ మాత్రం ఇంకా సమయం రాలేదని అంటోంది.
ప్రస్తుతం వడ్డీ రేట్లు 9 శాతం వరకూ ఉన్నాయి. కరోనా సమయంలో ఇది ఆరు శాతం వరకూ దిగిపోయింది. తర్వాత ద్రోవ్యోల్బణం పెరిగిపోతోందని చెప్పి వరుసగా పెంచుకుంటూ పోయింది. ఫలితంగా హోమ్ లోన్లు సూసైడ్ లోన్లుగా మారిపోయాయన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అతి తక్కువ అంటే.. 9 శాతం.. సిబిల్ స్కోర్ సరిగ్గా లేని వారికి ఇది పదకొండు శాతం కూడా ఉంటోంది. అంటే వ్యక్తిగత రుణానికి తీసుకునేంత వడ్డీ.
ఇళ్లకుడిమాండ్ పెరగాలంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఓ మార్గమని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. మరి ఆర్బీఐ ఎప్పుడు కరుణిస్తుందో ?