స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉంటూ నినదించిన రాజకీయ పార్టీలది అంతా రాజకీయమే తప్ప… స్టీల్ ప్లాంట్‌ను వాస్తవంగా కాపాడాలన్న లక్ష్యం లేదు. పోరాటంలో చిత్తశుద్ధి లేకపోవడంతో కేంద్రం కూడా… ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఢిల్లీకి సెగ తగలకుండా గల్లీలో ఉద్యమం చేస్తే ప్రయోజనం ఏంటి..?
స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో రాజకీయ పార్టీలు విశాఖలో ఆందోళనలు చేస్తున్నాయి. బంద్ చేశాయి. రోజూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళలన్నీ విశాఖలోనో.. ఆంధ్రలోనో జరుగుతున్నాయి. ఢిల్లీ వరకూ వెళ్లడం లేదు. గల్లీలోనే పోరాటాలు చేసి.. ఢిల్లీ కదలలాంటే ఎలా సాధ్యం..? కానీ రాజకీయ పార్టీలు…ఢిల్లీ వెళ్లి పోరాడాలని అనుకోవడం లేదు. కనీసం.. ఢిల్లీకి సెగ తగిలేలా.. విశాఖలో పోరాటం చేయాలన్న ఆలోచన కూడా చేయడంలేదు. ఫలితంగా… అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్య పెట్టే రాజకీయాలు చేసుకుంటున్నాయని.. తమ నిర్ణయాలు తాము తీసుకుంటామన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. అమ్మడం పక్కా అని తేల్చేసిన తర్వాత కూడా… రాజకీయ పార్టీల స్పందన చూస్తే.. వారికి కేంద్రంపై పోరాడే ఆలోచన లేదని తేలిపోతుంది.
ఏపీ ఎంపీలు ఒక్కరూ నోరెత్తరు..! వారిది ప్రజా రాజకీయమేనా..?
ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభలో ఇరవైఐదు మంది ఎంపీలు ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉన్నా.. ఇరవై నాలుగు మందిఎంపీలున్నారు. రాజ్యసభలోనూ పదకొండు మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు వైసీపీకి చెందినవారే. ముగ్గురు లోక్‌సభ…నలుగురు రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఇతర పార్టీలకు చెందినవారు. వారు కూడా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే. అంటే… విధానం పరంగా.. ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కానీ ఒక్కరంటే.. ఒక్కరు కూడా పార్లమెంట్లో తమ వ్యతిరేకతను వెల్లడించడం లేదు. సభను స్తంభింపచేసి.. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ గురించి… కేంద్రానికి తెలియచేయడం లేదు. అక్కడే సమస్య వస్తోంది. అధికార పార్టీకి కేసుల భయం… ప్రతిపక్ష పార్టీకి కేసుల్లో ఇరికిస్తారనే భయం. బీజేపీని ఎదిరించి నిలబడితే.. ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకమూ లేదు. గతంలో బీజేపీతో పోరాడితే ప్రతిపక్షానికి ఓటమే ఎదురయింది. ప్రజలు అండగా నిలబడకపోతే.. తాము నిండా మునిగిపోతామన్న భయం… పాలక.. ప్రతిపక్షాల్లో ఉంది. ఇలా అన్ని విధాలుగా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తున్నాయి కానీ… స్టీల్ ప్లాంట్ కోసం పోరాడటం లేదు.
నిఖార్సైన ప్రజా ఉద్యమం వస్తేనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ..!
రాజకీయ పార్టీలన్నీ… ప్రజా రాజకీయం చేయడం లేదు. మభ్య పెట్టే రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలే స్వచ్చందంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీలకు చాన్స్ లేకుండా.. ప్రజల్లోనుంచే ఉద్యమ నేతలు పుట్టుకుని రావాలి. ఉద్యమాన్ని ఏపీ మొత్తం హోరెత్తించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న కుట్రపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అలా ఉద్యమిస్తే.. స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టకుండా కేంద్రం వెనుకడుగు వేస్తుంది. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. రాజకీయ పార్టీలే.. దళారులుగా మారి.. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తాయి. దొరికినంత దోచుకుంటాయి., ఇక్కడ ప్రజలదే చాయిస్.