” ఆ మాట చెప్పే సరికి.. రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయానంతే. ఎక్కడికి వెళ్లానో కూడా తెలియదు..” ఓ ఆడియో ఫంక్షన్లో.. తను ఎదుర్కొన్న ఓ సిట్యూయేషన్ గురించి…. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట ఇది. అయితే ఇది ఆయన కామెడీగా చెప్పలేదు.. చాలా సీరియస్‌గా చెప్పారు. ఆయన విన్న మాటలు కూడా.. అంతే సీరియస్. జీవిత సత్యాలను నేర్పేవి. కానీ.. ఇప్పుడు అవే మాటలను.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అన్వయించేస్తున్నారు నెటిజన్లు. ఆయన ప్రెస్మీట్లో చెప్పే మాటలు విని జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా.. వెళ్లిపోతున్నామని సెటైర్లు వేస్తున్నారు. దీనికి కారణం.. ఆయన వెల్లడిస్తున్న జ్ఞాన గుళికలే.
కరోనా గురించి బేసిక్స్ కూడా తెలియనంత అమాయకత్వమా..!?
కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలన్నీ.. ఇప్పుడు పదో తరగతి పిల్లవాడ్ని అడిగినా చెబుతాడు. ఎవరికైనా ప్రాణం అంటే తీపి. ఆ ప్రాణం మీదకు తెచ్చిన వైరస్ గురించి.. తెలుసుకోని వారు ఎవరు ఉంటారు. ఆ వైరస్ ఎక్కడ పుట్టింది..? ఎలా వ్యాపించింది..? ఎలా ప్రాణాలు తీస్తోంది..? ఇదంతా రోజువారీ అప్ డేట్లుగా… స్మార్టు ఫోన్ల ద్వారా… చదువు రాని వారికి కూడా తెలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. కరోనా నుంచి ఐదు కోట్ల ఆంధ్రుల్ని కాపాడాల్సిన పరిస్థితిలో ఉండి.. కనీసం.. వైరస్ గురించి అవగాహన లేకుండా ప్రెస్మీట్లో మాట్లాడారు. కొరియాలో ఒక్కరికంటే ఒక్కరి కి వచ్చిందని.. అక్కడ్నుంచి అందరికీ వ్యాపించిందని చెప్పుకొచ్చారు. తర్వాత పక్కన జర్నలిస్టు చైనా నుంచి వచ్చిందని చెబితేనే ఆయన కాస్త రియలైజ్ అయ్యారు. అది కూడా.. ఆ జర్నలిస్టు చెప్పింది నిజమా.. తాను చెప్పేది నిజమా అనే సందేహంలోనే ఆయన సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే.. జగన్మోహన్ రెడ్డికి అసలు వైరస్ గురించి.. కనీస అవగాహన కూడా లేదని సులువుగానే అర్థమైపోతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం గురించే…ఇంత చిన్న విషయం తెలియకపోతే.. ఇక కట్టడి చేసే వ్యూహాలపై ఆయన ఎలా నిర్ణయాలు తీసుకోగలరన్న చర్చ దీని ద్వారానే వస్తోంది.
పారాసిటమాల్, బ్లీచింగ్ మాటలతోనే తేలిపోయిన ఐక్యూ..!
కరోనాపై జగన్మోహన్ రెడ్డి స్వాతిముత్యం తరహా ప్రకటనలు… కొరియాలో పుట్టిందని స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు.. అంతకు ముందు పారాసిటమాల్.. బ్లీచింగ్ పౌడర్‌తో వైరస్ అంతమయిపోతుందని చెప్పడం కూడా అందులో భాగమే. ప్రపంచం మొత్తం… వణికిపోతూంటే… ఇటలీ లాంటి దేశాలు శవాల దిబ్బగా మారుతున్నా కూడా.. జగన్మోహన్ రెడ్డి బ్లీచింగ్ పౌడర్‌కి.. పారాసిటమాల్‌కు ఫిక్సయిపోయారు. ఈ మాటలు విన్న తర్వాత సోషల్ మీడియా ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆయనను ఎంత కామెడీ చేయాలో అంత కామెడీ చేశారు. అయితే.. జగన్ చెప్పిన మాటలు కరెక్టేనని నిరూపించేందుకు .. ప్రజలను నమ్మించేందుకు వైసీపీ నేతలు.. వారి సోషల్ మీడియా టీం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి కేంద్ర ప్రభుత్వమే.. పారసిటామాల్పై జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమని చెప్పాల్సి వచ్చింది.
చూసి చదవడంలోనే అన్ని జ్ఞానగుళికలు.. ఇక మీడియా ప్రశ్నలు అడిగితే..!?
జగన్మోహన్ రెడ్డి మీడియాను ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారం చేపట్టిన పది నెలల కాలంలో ఆయన ఇప్పటికి రెండు సార్లు .. అదీ కూడా వారం రోజుల వ్యవధిలోనే ప్రెస్మీట్లు పెట్టారు. ఒకటి కరోనా సీరియస్ కాదని చెప్పడానికి.. మరొకటి కరోనా కారణంగా ఏపీని లాక్ డౌన్ చేస్తున్నామని ప్రకటించడానికి. ఈ రెండు ప్రెస్మీట్లలోనూ ఆయన బ్లూఫర్స్… సోషల్ మీడియా మీమ్స్ క్రియేటర్లకు.. కావాల్సినంత పని పెట్టాయి.వీటిని సమర్థించుకోవడం.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు తలకు మించిన బారంగా మారింది. అందులోనూ అసలు ట్విస్టేమిటంటే.. ప్రెస్మీట్లు అనే పేర్లే కానీ.. అక్కడ ఏ జర్నలిస్టునీ ప్రశ్నలు అడగనీయరు. అడిగినా సమాధానం చెప్పరు. చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోతారు. అది కూడా రాసుకొచ్చి చదువుతారు. అలా రాసుకొచ్చిన చదువుతున్న దాంట్లో నుంచే… జ్ఞానగుళికలు బయటకు వస్తున్నాయి.
నివారణకు ఒక్కటే మార్గం.. ప్రెస్మీట్లు పెట్టకపోవడం..!
విషయపరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉంటుంది కాబట్టే.. జగన్మోహన్ రెడ్డి అనేక మంది సలహాదారులను పెట్టుకున్నారని కొంత మంది నేతలు సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అంత మంది సలహాదారుల్ని పెట్టుకున్నా… మీడియా సమావేశాల్లో.. ఈ బ్లూఫర్స్ ఎందుకు వస్తున్నాయన్నది చాలా మందికి అర్థం కాని విషయం. సలహాదారులున్నారు కానీ.. వారి సలహాలు తీసుకోరని.. తాను చెప్పిందే కరెక్ట్ అనే వాదనతో ముందుకెళ్తారు కాబట్టే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని.. వైసీపీ నేతలు మథనపడుతున్నారు. కరోనాకు మందు లేదు..నివారణే మార్గం అన్నట్లుగా.. పరవుపోకుండాఉండటానికి మందు లేదు… ప్రెస్మీట్లు పెట్టకుండా చూసుకోవడమే మార్గమని.., వైసీపీ సోషల్ మీడియా సైనికులు జోకులేసుకుంటున్నారు.