దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీ నిర్ణయించారు. మే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది. వైరస్ మీదపడిపోతున్న సమయంలో ఇది రిలీఫ్ ఇచ్చే ప్రకటనే. అయితే.. ఇక్కడ మౌలికమైన సమస్యలు ఉన్నాయి. అదేమిటంటే… అసలు వ్యాక్సిన్ ఎక్కడ ఉంది..?. ప్రభుత్వం నలభై ఐదేళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఇలా పంపిణీ చేయడానికి అవసరమైన వ్యాక్సిన్ కూడా.. ఇప్పుడు అందుబాటులో లేదు. వ్యాక్సిన్ ఉత్సవ్ పేరుతో ఉత్సవాలు నిర్వహించినా టీకాల్లేవు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు వ్యాక్సిన్ డోసులు కావాలని లేఖలు రాస్తున్నాయి.
దేశంలో రెండే వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి. ఒకటి కోవిషీల్డ్.. రెండు కోవాగ్జిన్. ఈ రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం మేరకు చేస్తున్నా.. దేశ ప్రజలందరి అవసరాలను రాత్రికి రాత్రి తీర్చే పరిస్థితి లేదు. ఇతర ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఉత్పత్తి చేసినా… ప్రజల డిమాండ్‌లో పది శాతం కూడా అందుకోవడం కష్టమే. మరి అందరూ వేయించుకోవడానికి టీకాలు ఎలా వస్తాయన్నది ఇప్పుడు అతి పెద్ద డౌట్‌గా మారింది. విదేశీ టీకాలకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు. రష్యా టీకాకు అనుమతి ఇచ్చినా దాని ధర చాలా ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం ఉంది. అలాగే ఇతర విదేశీ టీకాలకు పర్మిషన్లను మూడు రోజుల్లోనే ఇస్తామని కేంద్రం చెబుతోంది.
టీకాల ధరలు తగ్గించేందుకు వాటిపై పన్నులు తగ్గించేందుకు సిద్ధమయింది. పర్మిషన్లు ఇచ్చినా… అవి అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. కానీ మే ఒకటి తేదీ నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కోవిడ్ భయానక పరిస్థితి.. ఒకటో తేదీన టీకాల కోసం వెంటపడేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. ఒకటో తేదీ నుంచి గందరగోళం ఏర్పడనుంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్ణయాలు ప్రకటించేస్తే.. ఇబ్బంది పడేది ప్రజలే. కానీ ప్రభుత్వాలు … వీటిని పట్టించుకోవడం లేదు.