తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఇప్పటి వరకు 402 మంది మాత్రమే కోలుకున్నారు. మిగిలిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో.. దర్శనాలు ఆపేయడంతో… ఎలాంటి సమస్యలు రాలేదు. అన్ లాక్ నిబంధనలతో దర్శనాలు ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోయాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు పదిహేను వేల మంది వరకూ ఉంటారు. వీరిలో 743 మంది వైరస్ బారిన పడ్డారంటే.. సామాన్యమైన విషయం కాదు. చాలా వేగంగా విస్తరించిందని అర్థం. సాధారణంగా… యాత్రికులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తూంటారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికే అవకాశం ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకూ తిరుమలకు వచ్చిన భక్తులెవరికీ వైరస్ లేదని.. అందుకే దర్శనాలు నిలిపివేయడం లేదని అధికారులు చెబుతూ వస్తున్నారు. మరి ఉద్యోగులకు వైరస్ ఎలా సోకిందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు., అర్చకుల్లోనూ… సగం మందికి రావడంతో.. కైంకర్యాలకు ఇబ్బందిపడే పరిస్థితి. ఇతర ఆలయాల నుంచి అర్చకుల్ని.. డిప్యూటేషన్ పై తీసుకు వస్తున్నారు.
దర్శనాలు ప్రారంభించిన తర్వాత భక్తులు కూడా గతంలోలా రావడం లేదు. జూలై నెల మొత్తం మీద 2 లక్షల38వేల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే రోజుకు ఎనిమిది వేల మంది . నిజానికి వీరంతా టీటీడీ వెబ్ సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు. వీరిలో సగం మంది కూడా.. దర్శనానికి రావడం లేదని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఆదాయం కూడా డిపోయింది. ఐదు నెలల నుంచి ఆదాయం పడిపోవడంతో.. బడ్జెట్ లెక్కలు.. జీతాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నసమయంలో.. బ్రహ్మోత్సవాలు ఎలా అన్న చర్చ ఇప్పుడు టీటీడీని టెన్షన్ పెడుతోంది. అర్చకులు ఏ సలహా ఇచ్చినా మేము సీరియస్‌గానే స్పందిస్తామని టీటీడీ ఈవో అంటున్నారు. బ్రహ్మోత్సవాలకు… రోజుకు రెండు లక్షల మంది వరకూ భక్తులు వచ్చేవారు. ఈ సారి అంత మందిని అనుమతించే అవకాశం లేదు. గరుడ సేవ రోజు.. తిరుమల కిక్కిసిరిపోతుంది. ఈ సారి ఎలా నిర్వహించాలనేది టీటీడీకి అర్థం కావడం లేదు.