ఇళయరాజా – వేటూరి… అద్భుతమైన జోడీ. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని గొప్ప గొప్ప పాటలొచ్చాయో. ఇద్దరూ కలిశారంటే… పాట సూపర్ హిట్టే. ఇళయరాజా ఎంత త్వరగా ట్యూన్ కట్టేవారో, అంతే త్వరగా ఆ పాటకు సాహిత్యాన్ని అందించి – శభాష్ అనిపించుకునేవారు వేటూరి. వీరిద్దరి మధ్య అద్భుతమైన ట్యూనింగ్ కుదిరేది. పాటని పక్కన పెడితే ఈ ప్రయాణంలో ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. ఇద్దరి ఆధ్యాత్మిక గురువూ ఒక్కరే. రమణ మహర్షి ఆశ్రమానికి ఇద్దరూ కలిసే వెళ్లేవారు. ఒకరి సాంగత్యాన్ని ఇంకొకరు ఇష్టపడేవారు. ఇళయరాజా ఓ మంచి ట్యూన్ కడితే.. ఆ పాట రాక ముందే పది మందికీ ఆ ట్యూను గురించి చెప్పేవారు వేటూరి. ఇళయరాజా కూడా అంతే. `మా వేటూరి ఎంత గొప్ప పాట రాశాడో తెలుసా` అంటూ… గర్వంగా చెప్పుకునేవారు.
అయితే వీరిద్దరి తొలి పరిచయం చిన్న గొడవతో మొదలైంది. అదీ అసలు విశేషం. ఆ సంగతిలోకి వెళ్తే..
రాజపార్వై అనే తమిళ సినిమా మ్యూజిక్సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ సినిమాని తమిళంలో పాటు ఒకేసారి తెలుగులోనూ తీద్దామనుకున్నారు. అందుకే తెలుగు, తమిళ సినిమా పాటలకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఒకేసారి మొదలెట్టారు. సంగీత దర్శకుడిగా ఇళయరాజా ఖాయమయ్యారు. ఒకటే ట్యూను. రెండు రిలిక్స్. ఒకటి తమిళంలో, ఇంకొకటి తెలుగులో. తమిళం నుంచి వైరముత్తు పాట రాయాలి. తెలుగు పాట వేటూరి రాయాలి. అంతకు ముందు వేటూరికీ, ఇళయరాజాకీ అస్సలు పరిచయం లేదు. ఇళయరాజా సంగీతానికి పాట రాయడం వేటూరి కి అదే తొలిసారి.
వైరముత్తునీ, వేటూరిని ఒకేసారి పిలిపించి, ఇద్దరికీ ఒకేసారి ట్యూను వినిపించి పాట రాయించుకుందామని ఇళయరాజా భావించారు. ఇళయరాజా చెప్పిన సమయానికి వైరముత్తు వచ్చేశారు. కానీ వేటూరి మాత్రం రాలేదు. వేటూరి కోసం ఎదురు చూసీ, చూసీ ఇక ఆయన రావడం లేదని వైరముత్తుకి ట్యూన్ వినిపించారు. ఆయన పాట రాసి కూడా వెళ్లిపోయారు. చెప్పిన సమయానికి వేటూరి రాలేదని ఇళయరాజాకి కోపం వచ్చింది. ఆనక ఎప్పుడో తీరిగ్గా వేటూరి వస్తే… `ఇప్పుడా రావడం? వైరముత్తు వచ్చి పాట రాసి వెళ్లిపోతే.. `అంటూ ఇళయరాజా కాస్త కసురు కున్నారు. వేటూరికి ఇలాంటి పుల్లవిరుపు వ్యవహారాలు బొత్తిగా నచ్చవు. `నేను చాలా బిజీ. అయినా మీ కోసం ఎదురు చూశాను..` అంటూ ఇళయరాజా తన నిరసన ఇంకా కొనసాగించారు. ఇక వినీ వినీ తట్టుకోలేని వేటూరి `మీరు బిజీ అయితే నేనూ బిజీనే. ఖాళీగా ఉన్నవాళ్లతో రాయించుకోండి` అంటూ… వేటూరి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే… దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆపసోపాలు పడి ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టాల్సివచ్చింది.
`కవిగారికి కోపం ఎక్కువలానే వుంది. వైరముత్తు ఇలా ట్యూన్ చెప్పిన ఐదు నిమిషాల్లో పాట రాసేశారు. మీరూ రాసేస్తే.. నాకు సమయం కలిసి వచ్చేది కదా.. అనేదే నా ఉద్దేశం` అంటూ మెత్తబడ్డారు ఇళయరాజా.
`వైర ముత్తు ఐదు నిమిషాల్లో పాట రాసి ఇచ్చారు` అనేది వేటూరి మైండ్లో అండర్ లైన్ అయ్యింది. ఆయన అయిదు నిమిషాల్లో రాస్తే… నేను రాయలేనా? అనే పంతం వచ్చింది
`ఏది ఆ ట్యూను` అని అడిగితే.. ఇళయరాజా ట్యూన్ చెప్పారు. ఆ ట్యూను వినగానే వేటూరికి బాగా నచ్చింది. ఇళయరాజాలో స్వరజ్ఞాని ఉన్నాడన్న సంగతి వేటూరికి అర్థమైపోయింది. దాంతో ఇది వరకటి కోపం తగ్గిపోయింది.
`పాట రాసుకుంటారా..` అని గొంతు సవరించుకోబోయారు.. వేటూరి.
`ఏంటి అప్పుడేనా` అంటూ ఇళయరాజా ఆశ్చర్యపోయారు. నిలబడిన మనిషి నిలబడినట్టే..
సుందరమో
సుమధురమో
చందురుడందిన
చందన శీతలమో … అంటూ అసువుగా పాట చెప్పేశారు వేటూరి.
నిమిషాల మీద పాట తయారైపోవడం, అందునా వైరముత్తు కంటే త్వరగా పాట ఇచ్చేయడం ఇళయరాజానీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి. అలా… ఒకరి ప్రతిభ ఒకరు తెలుసుకున్నారు. కోపాలు తొలగి.. స్నేహాలు మొదలయ్యాయి. అలా ఓ స్వర ప్రయాణానికి బీజం పడింది. ఈ సంఘటనని వేటూరి తన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో రాసుకున్నారు.