కేతన్ దేశాయ్.. ఈ పేరు చాలా మందికి చిరపరిచితం. ఎందుకంటే అవినీతిలో ఈయన రేంజ్ మామూలుది కాదు. దేశంలోవైద్య విద్యను సంస్కరించాల్సిన భారత వైద్య మండలికి చైర్మన్‌గా ఉండి… ఓ కాలేజీ అనుమతి కోసం రూ . రెండు కోట్లు లంచం తీసుకుంటూ నేరుగా దొరికిపోయిన ఘన చరిత్ర. ఇలా ఒక సారి కాదు.. రెండు సార్లు పదవులు పోగొట్టుకున్నారు. రెండు సార్లూ అవినీతి ఆరోపణల కారణంగానే. చాలా రోజులు జైల్లో ఉన్నారు. ఇప్పుడీయన హఠాత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడు అయిపోయారు.
ఇంత అవినీతి పరుడు టీటీడీలోకి రావడం ఏమిటని… బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. టీటీడీ బోర్డు నిండా నేర చరితులే ఉన్నారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. ఆ పిటిషన్‌పై జరిగిన విచారణలో హైకోర్టు ధర్మాసనం కూడా కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేయాలన్న హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
అసలు ఏపీకి ఏ మాత్రం సంబంధం లేని అత్యంత అవినీతి పరుడైన కేతన్ దేశాయ్‌కు ఎంతో డిమాండ్ ఉన్న టీటీడీ బోర్డులో ఏపీ ప్రభుత్వం ఎలా నియమించిందన్నది ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కని విషయంగా మారింది. ప్రభుత్వ పెద్దలకు వీరు ఎలా పరిచయమయ్యారు అనేది కూడా సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి నేర చరితులందర్నీ వెదికి వెదికి తిరుమలలో కూర్చోబెట్టినట్లుగా టీటీడీ బోర్డు ఉండటం మరింత వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తోంది.