ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో జరుగుతోన్న దాడులను చూసి నివ్వెరపోతున్నాయి. కర్రలు, రాళ్ళతో పలు ప్రాంతాలను రక్తసిక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఏపీలోని పలు ప్రాంతాలు యుద్దభూమిని తలపిస్తుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటె రిజల్ట్స్ రోజున ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని మధనపడుతున్నారు.
రాష్ట్రంలో కల్లోల పరిస్థితికి పోలీసులు, వారి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పోలీసులు ఉన్నతాధికారులు వైసీపీ డైరక్షన్ లో ఉద్దేశపూర్వకంగా జరుగుతోన్న అల్లర్లను నిలువరించకుండా చోద్యం చూశారని.. ఈ నిర్లక్ష్యమే రాష్ట్రంలోని పలు ప్రాంతాలు రణరంగంగా మార్చిందన్న విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ – వైసీపీల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి, చినికి గాలివానలా మారి…రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది. అక్కడ పరిస్థితులు చూస్తుంటే బీహార్ కన్నా దారుణంగా మారాయి. సీమలో ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్రమంతటా విస్తరించాయా..? అనే అనుమానం తలెత్తుతోంది. రెండు వర్గాల దాడిలో బలి అయ్యేది మాత్రమే అమాయక జనాలే. ఉద్వేగం, ఉక్రోషంలో కార్యకర్తలు ఆ ఆలోచనే చేయడం లేదు. ఎవడు రాసింది ఈ రక్త చరిత్ర..?
ఉద్రిక్తత పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు ఈసీ సీరియస్ ఆదేశాలు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వస్తుందని నమ్మకం కల్గినా…ఎన్నికలయ్యాక గొడవలకు, ఫలితాల రోజున జరగబోయే గొడవలకు లింకులు ఉండవా..? అంటే ఖచ్చితంగా ఉండవని చెప్పలేం. ఈ తరహ గొడవలు ఎన్నటికీ మానని గాయంలా నొప్పిని రాజేస్తుంటాయి. మరెంతోమందిని బలి తీసుకుంటాయి.
వీటన్నింటి నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజులను తలుచుకుంటే రాష్ట్రం ఎలా మారబోతుందన్న ఆందోళనను రెట్టింపు చేస్తోంది.