చంద్రబాబు గెలిచారు. సీఎం అయ్యారు. వెంటనే ఐదు సంతకాలు పెట్టారు. కానీ చాలా మంది సంతకాలు పెడితే పనైపోతుందా అమలవ్వాలి కదా అని మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఏపీ ఆర్థిక పరిస్థితి అలా ఉంది మరి. జగన్మోహన్ రెడ్డి ప్రతీ వారి ఆర్బీఐ ముందు కనీసం నాలుగు వేల కోట్ల అప్పుల కోసం నిలబడేవారు. వాటికి తోడు కనిపించిన ప్రతీ ఆస్తి తాకట్టు పెట్టేశారు. మందు బాబులను వచ్చే పాతికేళ్లకు తాకట్టు పెట్టేశారు. ఆదాయం పెరగలేదు. మరి ఎలా అమలు చేస్తారన్నదే సందేహం.
ముఖ్యంగా సామాజిక పెన్షన్లు. ఇప్పుడు నెలకు పందొమ్మిది వందలకోట్ల వరకూ ఖర్చు అవుతున్నాయి. అది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మూడు వేల కోట్లపైనే అవుతుంది. అదేమీ చిన్న మొత్తం కాదు. రూ. 250 పెంచడానికి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల సమయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు ఒక్క సంతకంతో వెయ్యి పెంచారు. ఇతర విభాగాల వాళ్లకు పదిహేను వేలుదాకా చేశారు.
ఇక మెగా డీఎస్సీ కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఖర్చులను పెంచేవే. ఇంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా హామీలు చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష చేశారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే సీఎం ఆషామాషీగా చేసి ఉండరని ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్రం నుంచి సహకారం.. ఆటోమేటిక్ గా ఏపీలో పెరిగే పెట్టుబడులు, వ్యవహారాలు, వైసీపీ నేతలు దోచిన ఆదాయాన్ని నిలిపేయడం ద్వారా సర్కార్ కు పెరిగే ఆదాయం వంటి వాటివి అంచనా వేసుకునే హామీల అమలు ప్రారంభించారని భావిస్తున్నారు.
చంద్రబాబు సంతకాల పవర్ మరో పదిహేను రోజుల నుంచి తేలనుంది. ఆ రోజున… ఒక్కో పెన్షన్ దారునికి ఏడు వేలు ఇస్తారు. ఆ తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తారు. అవి చేతికి అందితే… చాలా వరకూ సక్సెస్ అయినట్లే.