మంత్రి పదవులు అయిపోయాయి. స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా అయిపోయాయి. చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఫిల్ అయిపోయాయి. మంత్రి పదవి ఇవ్వలేకపోయినందుకు.. చెవిరెడ్డి లాంటి వాళ్లకు రెండు రకాల పదవులు ఇచ్చి బుజ్జగించారు. కానీ.. రోజా మాట మాత్రం వైసీపీలో ఎక్కడా వినిపించడం లేదు. అందుకే రోజా విషయంలో వైసీపీలో ఏం జరుగుతుందో.. అన్న క్యూరియాసిటీ ఆ పార్టీ నేతల్లో పెరిగిపోతోంది.
రోజాకు చాన్స్ రాకపోవడానికి కారణం ఏమిటి..?
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున.. నగరిలో రోజా ఆనందం.. అంతా.. ఇంతా కాదు. ఆమె ఘనంగా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. తనది ఐరన్ లెగ్ కాదని… తాను గెలిచానని.. అలాగే పార్టీ కూడా గెలిచిందని… తనది గోల్డెన్ లెగ్ అని.. చెప్పుకున్నారు. ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు.. పార్టీ సమావేశాల్లో మాట్లాడినప్పుడు… ఆమె జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తారు. ఇక మంత్రి వర్గం ప్రమాణస్వీకారం ఉందనగా.. మూడు రోజుల్లో రెండు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా మంది పార్టీ నేతలు శుభాకాంక్షలు చెప్పడం… ఎవరికి బెర్త్ ఉన్నా లేకపోయినా.. ఆమెకు ఖాయమన్న ప్రచారం జరగడంతో..పదవిపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. ఏదో తేదీన వైసీపీ ఎల్పీ భేటీ సమయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ.. సాయంత్రానికి ఆమెకు ఫోన్ కాల్ రాకపోవడంతో షాక్కు గురయ్యారు.
రోజాను ఎవరూ పట్టించుకోలేదా..?
రోజాకు హోంమంత్రి అని… స్పీకర్ అని రకరకాలుగా ప్రచారం జరిగింది. అది.. రోజాకు.. ఎంతో ఆనందాన్నిచ్చింది కానీ.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి.. అసలు పట్టించుకోకపోవడం మాత్రం.. ఆమెను బాధిస్తోందని.. సన్నిహితులు చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు కారణంగా.. మంత్రి పదవి ఇవ్వడం లేదు.. ఫలానా పదవి ఇస్తారని చెబుతారేమోనని.. ఆశ పడ్డారు. కానీ రోజాకు ఆ హామీ కూడా దక్కలేదు. ఆమె ముభావంగా ఉన్న విషయం తెలుసుకున్న తర్వాత కూడా.. పార్టీ అగ్రనేతలెవరూ ఆమెతో మాట్లాడలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకూ బయట జరిగిన ప్రచారం.. చివరికి.. తనకు ఏ పదవీ లేకపోవడంతో.. ఆమె చిన్నబుచ్చుకున్నారంటున్నారు.
రోజా అసంతృప్తికి గురైనా… చేయగలిగిందేమీ లేదు..!
ప్రభుత్వంలో ఇంకా నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి. అయితే.. వాటికి ప్రాధాన్యత తక్కువే. అయితే.. ఏ పదవీ లేకపోవడం కన్నా.. ఏదో ఓ పదవి ఉండటం మంచిది కదా.. అని రోజా అనుకుంటే… రాజీపడిపోయే అవకాశం ఉంది. వైసీపీ నేతలు కూడా.. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం .. ముగిసింది కాబట్టి.. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి.. పదవుల పంపిణీతో బుజ్జగించే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ పదవిని రోజాకు ఇస్తారని చెబుతున్నారు. రోజా.. అసంతృప్తి తో ఉన్నా.. ఎవరు బుజ్జగించినా కరిగిపోవాలి.. వేరే ఆప్షన్ లేదు. బహుశా.. వైసీపీ నేతల ధైర్యం కూడా అదేనేమో..?