గుడ్ మార్నింగ్ పేరుతో ధర్మవరంలో పొద్దున్నే జనంలోకి వెళ్లి వీడియోలు చేసి.. వదిలే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గానికి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వచ్చిన సత్యకుమార్ చేతిలో ఓడిపోయారు. ఆయన గుడ్ మార్నింగులు.. వీడియోలు.. వైరల్ రీల్స్ ఏవీ ఆయనను కాపాడలేదు. ఓడిపోయిన తర్వాత ఏడుస్తూ మరో వీడియో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఆయనకు ఆ హ్యాంగోవర్ తగ్గలేదని అనుకోవచ్చు.
ఆయన ఒక్కడే కాదు.. నందికొట్కూరు అనధికారిక ఎమ్మెల్యే తనేనంటూ రెచ్చిపోయిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఓ సోషల్ మీడియా స్టార్. నలుగురు ఆకు రౌడీల్ని వెంటేసుకుని తాను చేసేదే రాజకీయమని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఆయన వైసీపీని గెలిపించలేకపోయారు. ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు కూడా జగన్ సిద్ధం కాలేకపోయారు. ఇవ్వకపోయినా నంద్యాలలో గెలిచింది లేదు.
ఇక రాజమండ్రి రీల్స్ స్టార్ భరత్ గురించి చెప్పాల్సినపని లేదు. ఆయన డెబ్బై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీలో ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే గెలిచేస్తామని అనుకున్న చాలా మంది ఓటమి పాలయ్యారు. వీరెవరికి అవేమీ పని చేయలేదు.