బాలీవుడ్ తారల రీల్ లైఫ్ ఏదో రియల్ లైఫ్ ఏదో ఒక్కోసారి అర్థం కాదు. షూటింగ్ సమయంలోనే కాదు, మీటింగులు, ప్రమోషన్ ఈవెంట్లలోనూ మేకప్ తోనే కనిపించడంతో అంతా నటనలానే కనిపిస్తుంది. వాళ్ల ప్రేమలు కూడా ఓ పట్టాన అర్థం కావు. కొంత కాలం చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. నువ్వులేక నేను లేనంటారు. ఈ లవర్ దొరకడం నా అదృష్టమని మీడియా ముందు తియ్యటి డైలాగులు చెప్తారు. ప్రేమ వ్యవహారం చెడిన తర్వాత బద్ధ శత్రువులైపోతారు. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల ఎపిసోడ్ కూడా ఇలాంటిదే.
కైట్స్ సినిమాలో అద్భుతంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన ఈ జోడీ, రియల్ లైఫ్ లోనూ చాలా క్లోజ్ గా ఉండేది. సుజానే ఖాన్ తో విడిపోయిన తర్వాత హృతిక్ కు కంగనా ప్రేమ బంధం ఎంతో ఊరటినిచ్చిందట. పోనీలే మళ్లీ తన జీవితం గాడిలో పడుతుంది. ఓ మంచి తోడు దొరికింది అనుకునేటంతో ప్రేమ వ్యహారం బ్రేకప్ అయింది. అదీ అలాఇలా కాదు. ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. కత్తులు నూరుతున్నారు. లీగల్ నోటీస్ వార్ లో బిజీ బిజీగా ఉన్నారు.
తన ఫొటోలు, మెయిల్స్ ను హృతిక్ అందరికీ పంపుతూ పరువు తీస్తున్నాడని కంగనా ఆరోపిస్తోంది. ఆమే తన పరువు తీస్తోందని హృతిక్ ఆరోపిస్తున్నాడు. ఇద్దరూ పేజీల కొద్దీ లీగల్ నోటీసులు పంపుకున్నారు. వ్యవహారం పోలీస్ ఫిర్యాదు వరకూ వెళ్లింది. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని కంగనా డిమాండ్ చేస్తోంది. ఏయే చట్టాల కింద తనను మోసం చేశాడో, ఏ చట్టం కింద అరెస్ట్ చేయవచ్చో పోలీసులకు అనర్గళంగా చెప్తోంది. పోలీసులు మాత్రం ఈ గొడవలో ఎలా స్పందించాలో తెలియని స్థితిలో ఉన్నట్టున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని ఫొటోలు దిగినా ఎన్ని మెయిల్స్ పంపినా అంతా బాగానే ఉండేది. ఇప్పుడు ప్రతిదీ చెడుగానే కనిపిస్తోంది.
బంధు మిత్రులు గానీ బాలీవుడ్ పెద్దలు గానీ వీరిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసినట్టు లేదు. ఆవేశంలో ఉన్న వాళ్లకు ఆలోచన సరిగా ఉండదు. ఇలాంటప్పుడు పెద్దవాళ్లు సర్దిచెప్తే కాస్త ఫలితం ఉండొచ్చు. అపార్థాలను దూరం చేస్తే ఆవేశం తగ్గే అవకాశం ఉంటుంది. వీరద్దరిలో ఎవరూ దారుణమైన నేరాలు చేయలేదు ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిన తర్వాత పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడే సరైన కౌన్సెలింగ్ అవసరం. ఆ దిశగా ఎవరైనా చొరవచూపితే ఇద్దరికీ మంచిది. లేకపోతే ఈ వ్యవహారం వల్ల ఇద్దరి కెరీర్ మీదా ప్రభావం పడవచ్చు. అలా చెడును కొనితెచ్చుకోవడం అవసరమా అనేది వాళ్లు ఆలోచించుకునేలా చేయడమే మంచిది.