పోలవరం ప్రాజెక్టుకు అన్నీ అవాంతరాలే కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి సంబంధించి ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ ఏమాత్రమో క్లారిటీ రావడం లేదు. ఒకవైపు దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తాం అని విభజన చట్టంలో ప్రకటించిన అథారిటీ ఏర్పాటు కానేలేదు. ఇక్కడ పనులు వేగంగా జరగడం లేదు. అంచనాలను రివైజ్చేసి వేల కోట్ల రూపాయల భారం పెంచేశారు. ఒకవైపు నిర్మాణ వ్యయం వేలవేల కోట్లకు పెరిగిపోతూ ఉండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 300 కోట్లరూపాయలను ఈ ప్రాజెక్టుకోసం విదిలించడం చాలా భయానకమైన విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తెలంగాణ సర్కారు గోదావరి నది మీద కొత్తగా నిర్మించదలచుకుంటున్న అయిదు ఆనకట్టల వ్యవహారం మరొక ఎత్తు. ఈ అయిదు ఆనకట్టలు గనుక పూర్తయితే.. ఇక పోలవరం వరకూ వచ్చే నీళ్లు ఎంతమాత్రం ఉంటాయి? ఈ ప్రాజెక్టు ఉపయోగం ఎంతమేరకు ఉంటుంది? అనేదే ఇప్పుడు సందేహాస్పదంగా మారుతోంది.
పోలవరం ప్రాజెక్టు అనేదే గోదావరి వరదజలాల వినియోగాన్ని ఉద్దేశించి చేస్తున్న ప్రాజెక్టు. ఇది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల కేంద్రమే మొత్తం నిధులు భరించాల్సి ఉంది. అయితే అలా జరగడం లేదు. మరోవైపు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకుని తమ రాష్ట్రంలో గోదావరి నది మీద అయిదు కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి తెలంగాణ సర్కారు సన్నాహాలు చేసుకుంటున్నది. గోదావరి మీద తుమ్మిడిహట్టి, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ, పెన్‌గంగ మీద చనఖా-కొరాట, రాజంపేట, పంప్రాద్ వద్ద ఈ ఆనకట్టలు కట్టాలనేది టీసర్కారు ఆలోచన. అన్నీ పెద్ద ఆనకట్టలే. వీటి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. అంతా బాగానే ఉంది కానీ.. తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఇక పోలవరం వరకు రాగల వరదజలాల మోతాదు కూడా తగ్గిపోతుందనేది నిజం. ఆ మాటకొస్తే.. వరద జలాల సంగతి తర్వాత.. సాధారణ గోదావరి నీటి ప్రవాహం కూడా తగ్గిపోతుంది.
అప్పుడిక పోలవరం ద్వారా మొత్తం రాష్ట్రానికి అంతా నీరు అందించాలనే హామీలన్నీ ఏమవుతాయో అర్థం కావడం లేదు. ఒకవైపు అసలు పోలవరం నిర్మాణానికి సకాలంలో నిధులందక జరుగుతున్న జాప్యం, మరోవైపు ఇలాంటి భవిష్యత్ భయాలు రెండూ కలిపి పోలవరం గురించి ఆశలు పెంచుకుంటున్న ఆంధ్ర రైతులను అయోమయంలో పడేస్తున్నట్లుగా కనిపిస్తోంది.