హైదరాబాద్: బాహుబలి సూపర్ డూపర్ హిట్ కావటంతో ప్రభాస్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు ప్రముఖ వాణిజ్య సంస్థలన్నీ అతనిమీద కన్నేసినట్లున్నాయి. అతనికి యాడ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కార్ల దగ్గరనుంచి కొలోన్‌లు, షూస్, ఫిట్నెస్ పరికరాలు… ఇలా అనేక రకాల ఉత్పత్తులకు ప్రచారం చేయాలని ప్రముఖ యాడ్ సంస్థలు ప్రభాస్‌ను సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్ర వాహనాల యాడ్‌ను ప్రభాస్ అంగీకరించటం, షూటింగ్ ప్రారంభమవటంకూడా జరిగిపోయింది. దీనికిగానూ అతనికి కోట్లలోనే పారితోషికం ముట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు విపరీతంగా వస్తున్న యాడ్ ఆఫర్లను మేనేజ్ చేయటంకోసం ముంబాయికి చెందిన ఒక పీఆర్ సంస్థ సేవలను ప్రభాస్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సంస్థ బాలీవుడ్‌కు చెందిన దీపికా పదుకోన్, ఆమిర్ ఖాన్, సిద్దార్థ మల్హోత్రా, షాహిద్ కపూర్ తదితరులకుకూడా సేవలందిస్తోందట.
మరోవైపు బాహుబలి-2 షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో వస్తున్న యాడ్ ఆఫర్లలో ఏరి కోరి కొన్నింటిని మాత్రమే ప్రభాస్ సహాయకులు ఎంచుకున్నారని సమాచారం. వీటి ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రభాస్ త్వరలో ముంబాయి వెళతాడని, వీటి వివరాలను అక్కడ ప్రెస్ మీట్లో వెల్లడిస్తారని చెబుతున్నారు. అయితే ఇక ప్రభాస్ ముఖాన్ని రోజూ ఈ యాడ్లలో చూస్తామన్నమాట.