తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఆగష్టు 4 నాడు ఇండియన్ కమ్యూనిటీ మరియు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశ సన్నాహాలలో భాగంగా నిర్వాహక బృందం జూలై 28 ఆదివారం నాడు రాయల్ అల్బెర్ట్స్ పాలస్ సందర్శించారు. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు కానున్న ఈ సమావేశానికి చెయ్యాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరించే నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 10 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
Also Read : RRR సీఎం రేవంత్ రెడ్డికి గేమ్ ఛేంజర్ అవుతుందా?
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బహుళజాతి కంపెనీల సీఈవోలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఇప్పటివరకే అధికారులు కొన్ని ఎంఎన్సిలతో సంప్రదింపులు జరిపారని, ఎంఒయులపై సంతకాలు చేయడం పర్యటన సందర్భంగా సిఎం ప్రకటించే అవకాశం ఉంది.