ఏపీ మొత్తానికి అత్యంత ఫోకస్ తెచ్చుకొన్న నియోజక వర్గం పిఠాపురం. పవన్ కల్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో పిఠాపురం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్, ఈసారి అసెంబ్లీకి ఎలాగైనా వెళ్లాల్సిందే అనే ఆకాంక్షతో, లక్ష్యంతో ఏరి కోరి పిఠాపురం ఎంచుకొన్నారు. పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చిందో, అప్పుడే ఆయన గెలుపు లాంఛనమైపోయిందన్నది అభిమానుల మాట. పిఠాపురంలో పవన్ ఆదరణ.. రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. పైగా తెలుగు చిత్రసీమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలూ పవన్‌కు సపోర్ట్‌గా ప్రచారం చేస్తున్నారు. చిరు, రామ్ చరణ్, బన్నీ సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. ఈ ప్రభావం పిఠాపురం ఎన్నికపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు.
పవన్ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ మెజార్టీ ఎంతన్నది కీలకంగా మారింది. పవన్ గెలుపు, మెజారిటీ విషయంలో పందెం రాయుళ్లు జోరుగా డబ్బులు వెదజల్లుతున్నారు. వైకాపా వంగా గీత గెలుస్తుందని ఎవరైనా ధైర్యం చేస్తే రూపాయికి 30 రూపాయల కోసు పందెం కట్టడానికి పందెం రాయుళ్లు రెడీ. 50 వేల మెజార్టీ, 75 వేల మెజార్టీ, లక్ష మెజార్టీపై కూడా విరివిగా పందేలు జరుగుతున్నాయి. కేవలం పిఠాపురం నియోజక వర్గం చుట్టూనే వందల కోట్ల పందెం నడుస్తోందన్నది అక్కడి స్థానికుల మాట. ఇంకా గమ్మత్తైన విషయం ఏమింటే.. పిఠాపురంలో పవన్ గెలుస్తాడని కొంతమంది వైకాపా నాయకులు కూడా బెట్టింగులు వేశార్ట. పవన్ గెలుపుపై అంత ధీమా నడుస్తోందక్కడ.
మరోవైపు ఉండిలో రఘురామరాజు పోటీపై కూడా ఇలాంటి పందేలే నడుస్తున్నాయి. అక్కడ రఘురామని ఎలాగైనా ఓడించాలని జగన్ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అయినా సరే, రఘురామరాజు గెలుస్తారనే పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగులు వేస్తున్నారు. పశ్చిమగోదావరిలోని చాలా చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వాళ్లపైనే బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయని టాక్. గతంలో భీమవరంలో పవన్ గెలుస్తాడని బెట్టింగులు వేసి చాలామంది ఆస్తులు పోగొట్టుకొన్నారు. ఈసారి వాళ్లంతా రికవరీ మూడ్‌లో ఉన్నారని తెలుస్తోంది.