శ్రీమంతుడు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు మహేష్. బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ ముందు వరకూ ఆ ఊపు కొనసాగింది. మహేష్-మురుగదాస్ సినిమా గురించి బయటికి వచ్చిన వార్తలన్నీ భారీగానే ఉండేవి. 120 కోట్లపైన బడ్జెట్ పెడుతున్నారని అన్నారు, మహేష్‌కి జంటగా బోలెడుమంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎ.ఆర్. రెహమాన్ పేరు, ఇక మిగతా టెక్నీషియన్స్ పేర్లు కూడా పెద్ద పెద్దవే వినిపించాయి. అలాగే సినిమాను కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తారని అన్నారు. సీన్ కట్ చేస్తే బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అలాగే బాలీవుడ్లో మురుగదాస్ తెరకెక్కించిన ‘అకిరా’ సినిమాకు కూడా అలాంటి ఫలితమే వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచీ మాత్రం ఫ్లాప్ దెబ్బతో బడ్జెట్‌కి కోతలు పెట్టేశారన్న వార్తలే వినిపించాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకున్నారు. ఇక మిగతా వ్యవహారాలలో కూడా మరీ భారీ ఖర్చు విషయాలైతే ఏమీ కనిపించలేదు.
ఇప్పుడు మన ‘బాహుబలి’ ప్రభాస్ చేయబోయే సినిమా గురించి కూడా మొదట్లో మహేష్-మురుగదాస్ సినిమా గురించి వచ్చిన భారీ వార్తలే వస్తున్నాయి. బడ్జెట్ 150 కోట్లని అధికారికంగానే న్యూస్ బయటకు వచ్చింది. లేటెస్ట్గా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పేరు బయటకు వచ్చింది. ఇక మిగతా టాప్ బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపిస్తాయనడంలో సందేహం లేదు. టెక్నీషియన్స్ గురించి కూడా రోజుకో వార్త వినిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హైర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా వినిపిస్తున్న చాలా వ్యవహారాలన్నీ కూడా భారీగానే ఉన్నాయి. రాజమౌళి సినిమా రేంజ్‌లోనే సుజిత్ సినిమాకు కూడా బడ్టెట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు. అంతకు ముందు సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పి ఆ తర్వాత సినిమాలకు బడ్జెట్స్ పెచుకుంటూ పోవడం కరెక్ట్ కాదని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఆల్రెడీ చాలా సార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ రేంజ్లో ప్లాన్ చేస్తున్న వాళ్ళు.. రేపు బాహుబలి-2 సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా… అప్పుడు మళ్ళీ బడ్జెట్‌కి పరిమితులు విధించుకోకతప్పదు. అప్పుడు ఇంకా ఎక్కువ విమర్శలు వినిపించడం ఖాయం. కథకు అవసరమైనంత మేరకే ఖర్చు పెట్టడం అందరికీ శ్రేయస్కరమన్న విషయం మనవాళ్ళు గుర్తుంచుకుంటే ఇలాంటివి ఉండవేమో.