పదిహేనేళ్ల క్రితం తెలుగులో విడుదలై.. మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘ఛత్రపతి’. ప్రభాస్ స్టామినా ఏమిటో నిరూపించిన సినిమా ఇది. `ఛత్రపతి` తరవాత ప్రభాస్‌ని దర్శకులు చూసే కోణమే మారిపోయింది. ఇప్పుడు.. ఇన్నాళ్లకు ఈసినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడు. ఈ సినిమాకి దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. కానీ చాలా పేర్లు బయట వినిపిస్తున్నాయి. సుజిత్, ప్రభుదేవా, లింగు స్వామి.. వీళ్లలో ఒకరు దర్శకత్వం వహించొచ్చు. మొత్తానికి సౌత్ ఇండియన్ నుంచే దర్శకుడ్ని ఖరారు చేయొచ్చు.
అయితే ఈ సినిమా స్క్రిప్టులో చాలా మార్పులు చూసే అవకాశాలున్నాయి. ‘ఛత్రపతి’ రూపకర్త విజయేంద్ర ప్రసాద్ కే ఈ మార్పుల బాధ్యతనీ అప్పగించార్ట. ఆల్రెడీ ఆయన స్క్రిప్టుని రీ రైట్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో కథని మార్చబోతున్నార్ట. ఇప్పటికే `ఛత్రపతి` విడుదలై 15 ఏళ్లయ్యింది. డబ్బింగ్ రూపంలోనూ ఈ సినిమా చేసేశారు. కాబట్టి.. `ఛత్రపతి` సినిమా చూసిన హిందీ ప్రేక్షకులకు సైతం కొత్తగా కనిపించేలా మార్పులు ఉండబోతున్నాయట. ద్వితీయార్థంలో సెంటిమెంట్ డోసు.. తెలుగులో ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని వీలైనంత తగ్గించి.. మాస్ ఎలిమెంట్స్ జోడించబోతున్నారని సమాచారం. స్క్రిప్టు మొత్తం ఫైనల్ అయ్యాక.. మళ్లీ దర్శకుడి చేతిలో పెడతారు. అందుకే స్క్రిప్టు పూర్తయ్యేలోగా దర్శకుడ్ని వెదికే పనిలో పడ్డారు.