ఫ్రాంచైజీలను హిట్ చేయడం అంత సులభం కాదు. దానికి చాలా తెలివితేటలు, ప్రతిభ అవసరం. నిజానికి… ఓ హిట్టు సినిమాకి సీక్వెల్ రావడం సహజమైన విషయమే. అందులో వింతేం లేదు. వాటిలో.. విజయాలు సాధించిన సినిమాలు కూడా చాలా తక్కువే. కానీ బాహుబలి, కేజీఎఫ్ అలా కాదు. ఓ కథని భాగాలుగా విడగొట్టి, విడుదల చేశారు. బాహుబలి లాంటి పెద్ద కథని ఓకే సినిమాగా మలచడం.. కష్టమై, పార్ట్ 1, పార్ట్ 2గా తీశారు. ఆ ఫార్ములా సక్సెస్ అయ్యింది. ఆ తరవాత ఎన్టీఆర్ విషయంలోనూ అదే పద్ధతి కొనసాగించారు. అది బోల్తా కొట్టింది. దాంతో.. ఫ్రాంచైజీలను నడిపించడం చాలా కష్టమన్న భావవ వచ్చేసింది. అయితే ఇప్పుడు కేజీఎఫ్‌తో… ఆ మ్యాజిక్ ని రిపీట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇది సీక్వెల్ కాదు. ఓ కథకి అచ్చమైన కొనసాగింపు. చాప్టర్ 1 విజయాన్ని చూసి, చాప్టర్ 2పై ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి. అయితే.. వాటిని కేజీఎఫ్ 2 నిలబెట్టుకున్న తీరు ప్రశంసనీయం. బాహుబలి, కేజీఎఫ్ విజయాలు గాలివాటం కాదని… కొనసాగింపు చిత్రాలు నిరూపించుకున్నాయి. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2పై పడిపోయింది.
పుష్ఫని సైతం ఒకే సినిమాగా తీద్దామనుకున్నారు. కానీ రాను రాను కథ పెరిగి పెద్దదైపోవడం, అప్పటికే బాహుబలి 1, 2 చిత్రాలు స్ఫూర్తినివ్వడంతో.. పుష్ఫని రెండు భాగాలుగా విడుదల చేయడం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకున్నారు. అలానే పుష్ఫ 1 బయటకు వచ్చింది. అది సూపర్ హిట్టయిపోయింది. ముఖ్యంగా నార్త్‌లో ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే వంద కోట్లు కొట్టింది. అది కూడా కరోనా, థియేటర్ల సమస్యలు.. లాంటి ప్రతికూల పరిస్థితుల్లో. ఇప్పుడు అవేం లేవు. కాబట్టి… పుష్ఫ 2కి రెడ్ కార్పెట్ పరిచినట్టే. పుష్ఫ 1 కంటే, 2పై భారీ అంచనాలు ఉంటాయి. వాటిని మోయడం సామాన్యమైన విషయం కాదు. కేజీఎఫ్ 2లో కొత్త క్యారెక్టర్లు వచ్చాయి. కొత్త సంఘర్షణ ఏర్పడింది. అలాంటిదే.. పుష్ఫ 2లోనూ జరగాలి. ఫహద్ ఫాజిల్ ని చివర్లో తీసుకురావడం పట్ల అప్పట్లో విమర్శలు వినిపించాయి. అంత పెద్ద విలన్ ని పట్టుకుని, క్లైమాక్స్‌లో చూపిస్తావా? అనుకున్నారు. ఇప్పుడు అదే ప్లస్ కాబోతోంది. పుష్ఫ 2 వరకూ ఫహద్ కొత్త క్యారెక్టరే. ఆ పాత్ర నుంచి కావల్సినంత సంఘర్షణ రాబట్టొచ్చు. కాకపోతే.. పుష్ప 2పై భారీ ఒత్తిడి ఉంది. దాన్ని దాటుకొచ్చే మ్యాజిక్ ఏదో సుకుమారే చేయాలి.