చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ పేరు మదిలో మెదలగానే చాలా సన్నివేశాలు కళ్ల ముందు మెదులుతాయి. అందులో ట్రైన్ సీక్వెన్స్ ఒకటి. విలన్ గ్యాంగ్ ట్రైన్లో వెళ్తుంటే, చిరంజీవి వాళ్లని హెలీకాఫ్టర్లో ఛేజ్ చేస్తాడు. ఆ ఫైట్.. భారీగా ఖర్చు పెట్టి తీశారు. సినిమాలోని హైలెట్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదొకటి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ ఓ భారీ యాక్షన్ సీన్ డిజైన్ చేశాడు శంకర్. ఇందులో హీరో ట్రైన్లో వెళ్తుంటే, విలన్ గ్యాంగ్ హెలీకాఫ్టర్ లో ఛేజ్ చేస్తుంది. వాళ్లని చరణ్ రఫ్ఫాడించి, అదే హెలీకాఫ్టర్ లో.. తాను చేరవల్సిన గమ్యం చేరుకొంటాడు. ‘గేమ్ ఛేంజర్’లో వచ్చే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఇది. దాదాపు రూ.20 కోట్ల భారీ వ్యయంతో ఈ ఫైట్ డిజైన్ చేశాడు శంకర్. ఈ ఫైట్ మొత్తం చరణ్ లుంగీ గెటప్ లోనే ఉంటాడు. ఇదే పోస్టర్ని దీపావళి సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు ‘ఇంద్ర’ చిత్రాన్ని గుర్తుకు చేయడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 9న టీజర్ వస్తోంది. ఈ టీజర్లో ట్రైన్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. చరణ్ ఐఏఎస్గానూ ఐపీఎస్గానూ కనిపించబోతున్నాడు. సునీల్, సూర్య, అంజలి కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. మూడో పాట కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. కైరా అద్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.