కృష్ణా-గోదావరి బేసిన్ లో అతిపెద్ద గ్యాస్ నిక్షేపాలున్నట్లు అమెరికన్ జియలాజికల్ సర్వే సంస్థ కనుగొంది. అదే బేసిన్ లో గతంలో 14 లక్షల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాన్ని కనుగొన్నారు. దానిని రిలయన్స్ సంస్థ పైపుల ద్వారా గుజరాత్ కి తరలించుకుపోతోంది. రిలయన్స్ కి చెందిన కేజీ డి-6 గ్యాస్ క్షేత్రానికి కేవలం 30 కిమీ దూరంలోనే అంతకి పదింతల గ్యాస్ నిక్షేపం అంటే సుమారు 134 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపం బయటపడటం రాష్ట్రం, దేశం అదృష్టంగానే భావించవచ్చు. దాని విలువ సుమారు రూ.33 లక్షల కోట్లు ఉండవచ్చని ప్రాధమిక అంచనా.
గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు లేదా అశ్రద్ద కారణం కృష్ణా గోదావరి బేసిన్ లో బయటపడిన అపారమైన గ్యాస్ నిక్షేపాలు రిలయన్స్ సంస్థ స్వంతం చేసుకొంది. దాని నుంచి అది ఆర్జిస్తున్న లాభాలతో పోలిస్తే అది కేంద్రప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులు నామమాత్రమేనని చెప్పకతప్పదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల ఎక్కువ నష్టపోయిందని చెప్పకతప్పదు. రాష్ట్రంలో నుంచే గ్యాస్ వెలికి తీస్తున్నప్పటికీ దాని వలన రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు.
కనుక ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం ముందే జాగ్రత్తపడి, తాజాగా కనుగొన్న గ్యాస్ నిక్షేపాలలో సింహభాగం రాష్ట్రానికే దక్కేవిధంగా తగిన చర్యలు చేపట్టాలి. ఇప్పటికిప్పుడు ఆ గ్యాస్ నిక్షేపాల వెలికితీయడం సాధ్యం కానప్పటికీ, అది ఎప్పుడు తీసినా దాని వలన రాష్ట్రానికి పూర్తి ప్రయోజనం కలిగే విధంగా దూరదృష్టితో తగిన చర్యలు చేపట్టగలిగితే క్రమంగా రాష్ట్రం ఈ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కడమే కాకుండా, శరవేగంగా రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులని కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపదకుండానే పూర్తి చేసుకోవచ్చు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడి అవసరమైన చర్యలు చేపడితే చాలు…రాష్ట్రం ఈ సమస్యలన్నిటి నుంచి గట్టెక్కవచ్చు. విభజన కారణంగా కోలుకొని విధంగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని ఎవరూ ఆదుకోకపోయినా పై నుండి ఆ భగవంతుడే ఆదుకొన్నాడు. పాలకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు.