జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత ఓ మంచి పొజిషన్‌కు వచ్చిన జనసేన పార్టీ ఈ సారి ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం. ఆ రోజున ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతీ సారి ప్లీనరీ అంటే పవన్ కల్యాణ్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం పూర్తి స్థాయి రాజకీయ పార్టీ తరహాలో పలు తీర్మానాలు, కార్యక్రమాలను చేపట్టనున్నారు. రెండు, మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు.
ప్రతీ సారి ప్లీనరీని విజయవాడ, గుంటూరూ మధ్య ఏర్పాటు చేసేవారు. ఈ సారి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్న పిఠాపురంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. పవన్ కల్యాణ్ ను అత్యంత భారీ మెజార్టీతో గెలిచిపించిన ప్రజలను గౌరవించాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. పిఠాపురం ప్రజలకు అండగా ఉన్నానని సంకేతాలను పంపేందుకు ప్లీనరీని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. కూటమిలో చర్చించి అందరూ ఓకే అన్న తర్వాత నియోజకవర్గ స్థాయి నేతల్ని చేర్చుకుంటున్నారు. దిగువ స్థాయి నేతల్ని చేర్చుకునే అవకాశాల్ని ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ, మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. వీరిని చేర్చుకునే విషయంలో ఇతర పార్టీలు అభ్యంతరాలు పెట్టలేదు. ఇలా సమన్వయంతో మరిన్ని చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్లీనరీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి.