ఈనెల 24న కాటమరాయుడు విడుదలకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకి ప్రమోషన్లతో హైప్ మరింత తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. అందుకే పబ్లిసిటీతో హీట్ పెంచడానికి రెడీ అయ్యింది. శుక్రవారం కాటమరాయుడు తొలి పాటని విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ పాటతోనే ప్రమోషన్లకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ రెండు రోజులకూ ఓ పాటగానీ, మేకింగ్ వీడియో గానీ విడుదల చేస్తారు. ఈనెల 18న హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయనుంది చిత్రబృందం. 19 నుంచి ఇంటర్వ్యూల హంగామా మొదలెట్టేస్తారు. సాధారణంగా పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూలకు దూరం. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ కోసం తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. ఈసారీ పవన్‌తో గట్టిగా ప్రమోషన్లు చేయించాలని నిర్మాత శరత్ మరార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం కాటమరాయుడు షూటింగ్ అవ్వగానే.. త్రివిక్రమ్ సినిమా మొదలెట్టేసే మూడ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో మిరా మిరా మీసం.. తిప్పాడు జనం కోసం అంటూ సాగే గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 14 వరకూ… పాటల చిత్రీకరణ జరుగుతుంది. 21న కాటమరాయుడు సెన్సార్ ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.