ఘోరపరాజయం భారంలో ఉన్నప్పటికీ..భవిష్యత్‌పై.. ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ.. అమరావతిలో భారీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీన్ని అమరావతికి తరలించకతప్పలేదు. ఇప్పటికే అక్కడ ఉన్న జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా చేశారు. కానీ అది సరిపోవడం లేదు. అందుకే.. మంగళగిరి సమీపంలో.. నాలుగున్నర ఎకరాల్లో .. కార్యాలయాన్ని నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ లో నిర్మాణం ప్రారంభించారు. ఏడాదిలోనే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆరో తేదీన.. ఈ వేడుక జరుగుతోంది. సరైన కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే… సమస్యలు ఉండవని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బ్లాకులుగా నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కంటే 5 రెట్లు పెద్దది.
ఈ కార్యాలయం.. టీడీపీకి దక్కకుండా ఉండేందుకు… ఏపీ సర్కార్ అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. టీడీపీ కార్యాలయాన్ని నిర్మించిన స్థలం… ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నది. ఆ లీజును.. క్యాన్సిల్ చేయడానికి అవసరమైన ప్రయత్నాలను.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రారంభించింది. రెవిన్యూ శాఖ ద్వారా నోటీసులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యాలయంలో కొంత స్థలం.. ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ఆఫీసు కట్టారని.. అలాగే ప్రైవేటు రైతుల స్థలాన్ని ఆక్రమించి ఆ కార్యాలయం కడుతున్నారని… ఇప్పటికే రెవిన్యూ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలం లీజును క్యాన్సిల్ చేసి.. వెనక్కి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. టీడీపీకి లీజు కోసం స్థలం కేటాయించారు. మళ్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. స్థలం కేటాయించిన సమయంలో.. పెట్టిన నిబంధనలు అతిక్రమిస్తేనే.. వాటిని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. న్యాయస్థానంలో నిలబడవు. ఆ కోణంలో.. ఇప్పుడు ఏపీ అధికారులు.. టీడీపీ కార్యాలయం స్థలంలో నిబంధనలు ఏమైనా అతిక్రమించేరేమోనన్న ఉద్దేశంలో.. పరిశీలన జరుపుతున్నారు. ఈ కార్యాలయాన్ని ఎంతో కొంత వివాదాస్పదం చేయకుండా.. అయితే.. ఏపీ సర్కార్ వదిలి పెట్టే అవకాశం లేదని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలతో తేలిపోతుంది.