తెలంగాణాలోని పాలమూరు-రంగా రెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష నేటితో మూడవ రోజుకి చేరింది. తెదేపా, తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆయన పార్టీ మనుగడ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్ష చేస్తున్నారా లేకపోతే నిజంగానే తెలంగాణాలో ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ దీక్షకి కూర్చొన్నారా అనేది కాలమే చెపుతుంది. ఆయన దీక్ష ఉద్దేశ్యం ఏదైయినప్పటికీ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. పార్టీ నేతల జనసమీకరణ చేయడం వలననే అంత మంది తరలివచ్చారా? వచ్చినవారు ఆయన వాదనతో ఏకీభవిస్తున్నారా లేదా అనే విషయాలు కూడా అప్రస్తుతమే. జగన్ చేస్తున్న దీక్షకు అంతమంది హాజరవడమే విశేషం. నిత్యం వేలాది మంది ప్రజలు దీక్షా స్థలికి వచ్చి వెళుతున్నారు. కొంతమంది మూడు రోజులుగా అక్కడే మకాం వేసి జగన్మోహన్ రెడ్డి దీక్షకి సంఘీభావం తెలుపుతున్నారు. చివరి రోజైన ఈ రోజు కూడా చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచి చాలా బారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. జగన్ ఇదివరకు కూడా చాలాసార్లు చాలా జిల్లాలలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసారు కానీ వాటన్నిటికీ మించి ఇప్పుడు కర్నూలులో మంచి ప్రజాస్పందన కనబడుతోంది.
ఓటుకి నోటు కేసు కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు వెనుకాడుతున్నారని జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా నేతలు అందరూ పదేపదే చెపుతున్న మాటలు ప్రజలకు చేరవనుకొంటే అవివేకమే. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో సహా అనేకమంది మంత్రులు, తెరాస నేతలు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, జగన్ పై నిప్పులు కురిపించడానికి పోటీలు పడే తెదేపా మంత్రులు, నేతలు గానీ గట్టిగా మాట్లాడకపోవడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.
తెరాస మంత్రులు అంత గట్టిగా మాట్లాడుతున్న కూడా తెదేపా మంత్రులు మాట్లాడలేకపోవడం వలన జగన్ వాదనలకు బలం చేకూరుతున్నట్లు అవుతోంది. ప్రత్యేక హోదా, నిధుల విషయంలో కేంద్రంతో, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడలేని అసమర్ధుడు మన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు చేస్తున్న ప్రచారం ప్రజలకు బలంగానే చేరుతోందని ఆయన దీక్షకు వస్తున్న జనాల్ని చూస్తే అర్ధమవుతుంది. వారు ఆయన వాదనతో ఏకీభవిస్తున్నారో లేదో తెలియకపోయినా తెదేపా ప్రభుత్వం దీనిని ఒక హెచ్చరికగానే స్వీకరించి అప్రమత్తం అవడం మంచిది.