ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2017లో విజయవాడలో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అమరావతి నుంచి తరలించడానికి రాజధానిలోని పలు విభాగాలను తరలించడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమో కానీ.. కొత్త ఏర్పాటు చేయడానికి ఎలాంటి సమస్యలు లేవు. ఏపీ ప్రభుత్వానికి ఈ లాజిక్ బాగా నచ్చింది. వెంటనే కర్నూలు న్యాయరాజధానిలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అవకాశం చిక్కింది. దాన్ని వినియోగించుకుంది.
ఇప్పటి వరకూ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉంది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ పక్కరాష్ట్రంలో ఎందుకు ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనే హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చుని ప్రభుత్వానికి అధికారం ఉందని హైకోర్టుకూడా స్పష్టం చేయడంతో అడ్డంకులు తొలగిపోయినట్లయింది.
హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏపీ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయనుంది. కాగా, ఇప్పటివరకు లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్ నుంచి పనిచేశాయి. ప్రస్తుతం హెచ్ఆర్సీ, లోకాయుక్తల తరలింపు హైకోర్టు విచారణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా కొన్నాళ్ల క్రితం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మందాట సీతారామమూర్తి పేరును ప్రకటించారు. కార్యాలయం లేకపోవడంతో ఆయన ఇంట్లోనే బాధ్యతలు తీసుకున్నారు.